షబాష్ ఒవైసీ.. బాగా మాట్లాడారు!

Update: 2019-03-12 04:40 GMT
రాజకీయాలు చేయడానికి హద్దంటూ లేకుండా పోయింది పొలిటికల్ పార్టీలకు. ఆఖరికి ఎన్నికల తేదీల విషయంలో కూడా వీరు రచ్చే చేస్తూ ఉండటం విశేషం. అందులోనూ.. మత పరమైన రచ్చ చేస్తూ ఉండటమే ఇక్కడ హేయమైన అంశం. పశ్చిమ బెంగాల్ లోని టీఎంసీ వాళ్లు, ఢిల్లీకి పరిమితం  అయిన ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్లు..ఎన్నికల తేదీల్లో కూడా మతపరమైన కోణాన్ని చూశారు.

అదెలాగంటే.. తమ తమ రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ తేదీలు  రంజాన్ మాసంలో వచ్చేలా చేశారని, ఇదంతా బీజేపీ వాళ్ల కుట్ర అని అటు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇటు టీఎంసీ ఆరోపిస్తూ  ఉన్నాయి! రంజాన్ మాసంలో పోలింగ్ తేదీ రావడం వల్ల.. ముస్లింలు ఓటేయడానికి వీలుండదని, ముస్లింలు ఓటేయడానికి వీల్లేకుండా చేయడానికే బీజేపీ ఎన్నికల సంఘంతో కలిసి కుట్ర  చేసిందని ఆప్, టీఎంసీలు ఆరోపిస్తూ ఉన్నాయి. ముస్లింలను ఓటు హక్కుకు దూరం చేయడానికే మోడీ ప్రభుత్వం ఇలా కుట్రచేస్తోందని ఆ పార్టీలు వాదిస్తూ ఉన్నాయి.

బహుశా ఇంత కన్నా కామెడీ మరోటి ఉండదేమో. ఇలాంటి మత పరమైన రాజకీయాలు చేసే.. ఈ లౌకికవాద పార్టీలన్నీ బీజేపీని హీరోగా మార్చాయి. రంజాన్ మాసం అయితే  ముస్లింలు ఓటేయరా? రంజాన్  మాస్ అయితే వాళ్లు ఇంటికే పరిమితం అవుతారా? ఇంట్లోంచి బయటకు కూడా రారా? ఈ ప్రశ్నలు అన్నీ  వేస్తోంది మరెవరో కాదు ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఒవైసీ. టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీల వాదనను ఒవైసీ కొట్టి పడేశారు.

రంజాన్  మాసంలో ముస్లింలు ఓటు వేయడానికి బయటకు రారు అనేది డొల్ల వాదన అని, పోలింగ్ తేదీలను రంజాన్ మాసంలో వచ్చేలా చేయడంలో తప్పేమీ లేదని..ఆయన అన్నారు. మత పార్టీ అనే ఇమేజ్ ఉన్న ఎంఐఎం నేత లాజికల్ గా మాట్లాడితే.. మత రాజకీయమే చేయడమే పనిగా పెట్టుకుని, అయిన దానికి కాని దానికి మైనారిటీలపై అనవసరమైన సానుభూతిని వ్యక్తం చేస్తున్న ఆప్, టీఎంసీ వంటి పార్లీలు మాత్రం కేవలం మత రాజకీయమే పనిగా పెట్టుకుని మాట్లాడినట్టుగా అనిపిస్తోంది ఈ వ్యవహారంలో!

రంజాన్ మాసంలో ఎన్నికలనే రద్దు చేయాలి అన్నట్టుగా.. ఆ నెల అంతా.. పోలింగ్ జరపకుండా.. రంజాన్ పండగ అయిపోయాకా పోలింగ్ పెట్టుకోవాలన్నట్టుగా ఉంది టీఎంసీ, ఆప్ ల వాదన. రంజాన్ నెలలో ముస్లింలు ఎంచక్కా తమ పనులు తాము చేసుకొంటూ ఉంటారు. ఉపవాసంలో ఉండి కూడా ఉద్యోగాలు చేసుకొంటారు. తమ తమ పనులు చేసుకుంటారు. అలాంటిది..  ఓటు  వేయడానికి మాత్రం రంజాన్ మాసం అడ్డం అవుతుందని రాజకీయ పార్టీలు వాదించడం  నిజంగా మరీ చీప్ పాలిటిక్సే!
    

Tags:    

Similar News