న్యూ యియర్ రోజునే బీఆర్ఎస్‌లో పొంగులేటి అసమ్మతి గళం

Update: 2023-01-02 05:36 GMT
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్త సంవత్సరం తొలి రోజున సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నప్పటికీ ఎల్లకాలం ఆ పార్టీలో ఉండలేనని చెప్పారు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి టీఆర్ఎస్‌లో చేరితే 2019లో ఆ పార్టీ తనకు టికెట్ కూడా ఇవ్వలేదని..

ఆ తరువాత పదవులు ఇస్తామని చెప్పిన ఆ హామీలు కూడా నెరవేర్చలేదని... తనకు టికెట్ ఇవ్వకపోవడంపై అనుచరులు ఆగ్రహంగా ఉన్నారని.. టికెట్లు ఇవ్వకపోతే ఉండలేం కదా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు... బీఆర్ఎస్ తనకు ఎలాంటి గౌరవం ఇచ్చిందో అందరికీ తెలుసని వ్యంగ్యంగా అన్నారు.

తాను, తన అనుచరులు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని... తాను మూడు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని.. ఏఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తాననేది త్వరలో చెప్తానని ఆయన ప్రకటించారు.
పొంగులేటి వ్యాఖ్యలతో ఖమ్మం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్‌లో చాలాకాలంగా ఆయనకు ప్రాధాన్యం లేకపోవడం... స్థానికంగా పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు,  పువ్వాడ అజయ్ వర్గాలతో ఆయనకు సయోధ్య లేకపోవడంతో పొంగులేని దారెటు అనే చర్చ మొదలైంది.

బీఆర్ఎస్ దేశమంతా విస్తరించాలనుకుంటున్న క్రమంలో సొంత రాష్ట్రంలోనే ఆ పార్టీ నేతలు ఇలా తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండడంతో పార్టీ అధిష్ఠానంలోనూ కలవరం కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్థికంగా బలమైన నేత కావడంతో పాటు బలమైన అనుచరవర్గమూ ఉంది. దీంతో ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక నియోజకవర్గాలను ప్రభావితం చేయగల సమర్థుడు. ఈ నేపథ్యంలోనే పొంగులేటి బీఆర్ఎస్‌ను వీడితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి కష్టమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News