బాలయ్యపై 'పొన్నం'ది పసలేని ఫిర్యాదే

Update: 2016-02-04 15:30 GMT
గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్ లో ఓటు వేసిన నందమూరి బాలకృష్ణపై మాజీ ఎంపీ, టీ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన ఫిర్యాదులో పస లేదని... ఆయన ఫిర్యాదు నిలవదని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్ ఏపీలో లేదని... నందమూరి బాలకృష్ణ ఏపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి పొరుగు రాష్ట్రంలో ఓటెలా వేస్తారన్నది పొన్నం ప్రశ్న. ఆయన అక్కడితో ఆగలేదు. ఏకంగా బాలయ్య అసెంబ్లీ సభ్యత్వాన్నే రద్దు చేయాలని డిమాండు చేశారు.

రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ ఏపీ - తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా ఉంది.  ఈ విషయాన్ని పొన్నం మర్చిపోయినట్లున్నారు. ఒక రాష్ట్రానికి రాజధానిగా ఉన్న నగరంలో ఓటు హక్కు ఉండడంలో ఎలాంటి తప్పు ఉండదని, అది ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కూడా తప్పుకాదని నిపుణులు అంటున్నారు. టీడీపీ నేతలూ అదే విషయం చెబుతున్నారు. పొన్నం  రాజకీయ అవగాహన రాహిత్యంతో ఈ ఫిర్యాదు చేశారని వారు ఆరోపిస్తున్నారు.

అంతేకాదు... తన సొంత పార్టీ నేతలను ఎంఐఎం వారు దారుణంగా కొట్టినా కూడా పట్టించుకోని పొన్నం ప్రభాకర్ కు టీడీపీ నేతల వ్యవహారంతో పనేంటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ కనుమరుగవడంతో ఆయన మాటలనెవరూ మీడియాలో ప్రాధాన్యం ఇవ్వకపోతుండడంతోనే పొన్నం ఇప్పుడు బాలకృష్ణపై ఆరోపణలకు దిగుతున్నారని... బాలకృష్ణ పై ఆరోపణలు చేస్తే మీడియాలో కనిపించొచ్చని తాపత్రయ పడుతున్నారని టీడీపీ శ్రేణులు విమర్శించాయి.

ఇదంతా ఎలా ఉన్నా... పొన్న ఆరోపణల నేపథ్యంలో చూసుకుంటే బాలయ్య శాసనసభ్యత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని తెలుస్తోంది. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ నియోజవర్గం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు రాజధాని హైదరాబాద్ కాబట్టి ఆయన అక్కడ ఓటేయడంలో ఎలాంటి తప్పు ఉండదు. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఇది ఉల్లంఘించినట్లు కాదు. కాబట్టి బాలయ్య పదవికి ఢోకాఉండదని... పొన్నం ఫిర్యాదును ఎన్నికల సంఘం చెత్తబుట్టలో వేస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
Tags:    

Similar News