స్థలం కబ్జా చేసిన ముఖ్యమంత్రి

Update: 2015-05-25 06:36 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్థలం కబ్జా చేశారు! ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఈ చర్యను అడ్డుకునేందుకు పై స్థాయి వారికి ఫిర్యాదు చేయడం మార్గం. కేసీఆర్‌ పై ఊ అంటే విరుచుకు పడుతూ సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అదే పని చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి ఆయన లేఖ రాశారు!

 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా యూనివర్శిటీ భూముల్ని కబ్జా చేస్తోందని పొన్నం ఆరోపించారు. నిజాం ప్రభుత్వం నిర్మించిన, ప్రతిష్ఠాత్మకమైన ఓయూకి చెందిన భూములు కొన్ని ఇప్పటికే కబ్జా అయ్యాయని తెలిపారు. తాజాగా కేసీఆర్‌ కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దీన్ని నిరోధించాలని కేంద్రమంత్రికి రాసిన లేఖలో పొన్నం కోరారు. పేదలకు ఇళ్లు కట్టడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే అందుకు నగరంలో ఇంకా చాలా భూములు ఉన్నాయని వివరించారు. ప్రభుత్వం నుంచి భూములు పొందిన కొన్ని సొసైటీలు, సినీ స్టూడియోలు నిబంధనలకు విరుద్ధంగా ఫంక్షన్‌ హాళ్లను నిర్వహిస్తున్నాయని తెలిపారు. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని.. ఇలాంటివాటిని పేదలకు ఇళ్లకు ఉపయోగించాలని సూచించారు. ఓయూ భూముల్ని వాడుకోవాలనుకుంటున్న ప్రభుత్వ ప్రయత్నాన్ని, కబ్జా యత్నాలను నిరోధించాలని పొన్నం కోరారు.



మొత్తంగా ప్రభుత్వానికి చెందిన మరో వివాదంతో పొన్నం తెరమీదకు వచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్‌ నే కబ్జాకోరుగా ఇరికించారు.

Tags:    

Similar News