బాబు, కేసీఆర్ కుమ్మ‌క్కు వ‌ల్లే...

Update: 2016-07-02 12:31 GMT
టీపీసీసీ ఉపాధ్యక్షుడు - మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. హైకోర్టు విభజన కోసం న్యాయవాదులు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి రావడం బాధకరమన్నారు. రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంత వరకు ఉన్నత న్యాయస్థానంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కేసీఆర్‌ - చంద్రబాబుల లోపాయికారి ఒప్పందం వల్లే హై కోర్టు విభజన ఆలస్యం జరుగుతోందని పొన్నం విమ‌ర్శించారు. ఎన్నికలకై హై కోర్టు విభజనను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాకట్టు పెట్టారని ఆరోపించారు.

హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికలకు చంద్రబాబు రాకపోవడంతో టీఆర్‌ ఎస్‌ ను గెలిచింద‌ని పేర్కొన్న పొన్నం ఈ అవ‌గాహ‌న‌లో భాగంగానే హైకోర్టు విభజన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒత్తిడి తేవడం లేదని విమర్శించారు.

ఓటుకు నోటు విషయంలో చంద్రబాబుని అనేక విధాలుగా ఆరోపించిన కేసీఆర్‌ హై కోర్టు విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. దీంట్లో లోపాయికారి ఒప్పందం ఉండడం వల్లే మౌనం వహిస్తున్నారన్నారు. ఈ విషయం తెలిసిన కేంద్ర మంత్రులు కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తే స్వాగతిస్తామంటున్నారని తెలిపారు. రెండు సంవత్సరాలుగా హై కోర్టు విభజనకై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

న్యాయవాదులు ఛలో ఇందిరా పార్క్‌ కార్యక్రమం తీసుకునే కన్నా ఛలో తెలంగాణ భవన్‌ - చలో సచివాలయం కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుందని సూచించారు. ఎక్కడ పని జరుగుతుందో మేథావులకు వారికి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కొందరూ బార్‌ అసోసియేషన్‌ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తూ న్యాయవాదులను తప్పుదోవ పటిస్తున్నారని ఆరోపించారు. ఓ ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో హై కోర్టును విభజించాలని 11 మంది జడ్జీలు సస్పెండ్‌కు గురవడమే కాకుండా పోలీసుల లాఠీ దెబ్బలు తినడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం ఇప్పుడు ముఖ్యమంత్రికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
 
తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు - ఉద్యోగులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చిన కేసీఆర్‌ తెలంగాణ నాయకులు ధర్నాలు చేస్తుంటే అరెస్ట్‌ చేయాలని జివోలు తీసుకురావడం హాస్యాస్పందంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి విలువలు ఉంటే ఢిల్లీలో ధర్నా చేసి హై కోర్టును తీసుకురావాలని సవాల్‌ విసిరారు. నాటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణను తీసుకువచ్చామంటున్న తెరాస నాయకులు.. ఇప్పుడు హై కోర్టును ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించి ఉన్నత న్యాయంస్థానంపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. మ‌రోవైపు ఆరోగ్య శ్రీ సేవలు శుక్రవారం నుంచి అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించాల్సిన పాత బకాయిలు రూ. 750 కోట్లు చెల్లించడంలో ప్ర‌భుత్వం విఫలమైందన్నారు. అదే విధంగా జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ కార్డులను ఇవ్వడంలో అచేతన స్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. తెలంగాణ వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్‌ కార్డులనే కలిగి ఉండడం బాధకరమన్నారు.

Tags:    

Similar News