ఆ కార్డుకు చెల్లుచీటి ఇచ్చేసిన‌ట్లేనా?

Update: 2019-06-23 04:35 GMT
ఇద్ద‌రు మాట్లాడుకోవ‌టం ఇప్పుడు చాలా తేలిక‌. అమెరికా అయినా అన‌కాప‌ల్లి అయినా చేతిలో ఉండే సెల్ ఫోన్ తో క్ష‌ణాల్లో క‌నెక్ట్ అయిపోవ‌చ్చు. అల్లంత దూరాన ఉండి ముఖ‌ముఖాలు చూసుకోవాలంటే అయితే వాట్సాప్ కాల్ లేదంటే ఏదో ఒక వీడియో కాల్ తో చూసుకొని మాట్లాడుకునే స‌దుపాయం వ‌చ్చేసింది.

ఇంటికి చేరాక ఒక కార్డు రాసేయ్ అనే రోజులు నిన్న‌గా మారాయి. గ‌తంలో విరివిగా వాడిన పోస్ట‌ల్ కార్డు ఇప్పుడు దాదాపు క‌నిపించ‌ని ప‌రిస్థితి. మారిన జీవ‌న‌శైలి.. స‌ద‌రు పోస్ట‌ల్ కార్డు ఖ‌ర్చు అంత‌కంత‌కూ పెరిగిపోతున్న నేప‌థ్యంలో పోస్ట‌ల్ శాఖ ఈ కార్డు ప్రింటింగ్ ను నిలిపివేసిన‌ట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 150 ఏళ్ల నుంచి పెన‌వేసుకున్న ఈ బంధం ఇక తెగిన‌ట్లేన‌న్న సందేహాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

సాంకేతిక విప్ల‌వం నేప‌థ్యంలో ఇరువురు మాట్లాడుకోవ‌టానికి.. ఒక‌రి విష‌యాలు మ‌రొక‌రు తెలుసుకోవ‌టానికి వీలుగా ఎన్నో ర‌కాలు అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో త‌పాలా శాఖ ప్రింట్ చేసే పోస్ట్ కార్డును నిలిపివేసే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే దీని ప్రింటింగ్ ఆపేసిన‌ట్లుగా స‌మాచారం.

గ‌తంలో ప‌దిహేను పైస‌లు.. ప్ర‌స్తుతం యాభైపైస‌లున్న పోస్ట‌ల్ కార్డు త‌యారీకి రూ.7.45ఖ‌ర్చు అవుతోంది. దీన్ని యాభై పైస‌ల‌కు అమ్మ‌టం కార‌ణంగా ఒక పోస్ట‌ల్ కార్డుకు రూ.6.95న‌ష్టం వ‌స్తోంది. దీంతో పోస్ట‌ల్ కార్డు అమ్మ‌కం త‌పాలాశాఖ‌కు భారీ న‌ష్టాల‌కు కార‌ణంగా మారుతోంది. ఈ నేప‌థ్యంలో పోస్టాఫీసుల్లో కార్డుల అమ్మ‌కం నిలిపివేశారు. అదేమంటే.. కార్డుల‌కు కొర‌త ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఇప్ప‌టికిప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పోస్టాఫీసుల్లో ఒక్క పోస్ట‌ల్ కార్డు కూడా లేద‌న్న మాట వినిపిస్తోంది. దీనికి పోస్ట‌ల్ అధికారులు అధికారికంగా ఎలాంటి మాట చెప్ప‌టం లేదు. లోగుట్టుగా తెలిసిన స‌మాచారం ప్ర‌కారం.. ఈ పోస్ట‌ల్ కార్డును మ‌హారాష్ట్రలోని నాసిక్.. హైద‌రాబాద్ ప్రింటింగ్ ప్రెస్ ల‌లో త‌యారు చేస్తుంటారు. గ‌డిచిన కొంత‌కాలంగా వీటి ప్రింటింగ్ ఆపిన‌ట్లుగా తెలుస్తోంది.

సాంకేతిక ప‌రిజ్ఞానం భారీగా పెరిగిన నేప‌థ్యంలో టెలిగ్రామ్ ను నిలిపినట్లే తాజాగా పోస్ట‌ల్ కార్డు విష‌యంలోనూ ప్ర‌భుత్వం నిలిపివేసే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. తొంభైల త‌ర్వాత పుట్టిన వారికి పోస్ట‌ల్ కార్డుల మీద అవ‌గాహ‌న త‌క్కువ‌. ఇక‌.. మిలీనియం త‌ర్వాత పుట్టినోళ్ల‌కు పుస్త‌కాల్లో త‌ప్పించి.. విడిగా ప‌రిచ‌యం కూడా లేదు. కేంద్రం కానీ పోస్ట‌ల్ కార్డుల‌ను బంద్ చేయాల‌ని అధికారికంగా ప్ర‌క‌ట‌న చేస్తే.. కార్డు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయిన‌ట్లే. మారుతున్న కాలానికి త‌గ్గ‌ట్లు మార‌టం బాగానే ఉన్నా.. 150 ఏళ్ల అనుబంధం ఆగిపోవ‌టం బాధ క‌లిగించ‌క‌మాన‌దు.


Tags:    

Similar News