అమ్మ కుర్చీలో ఆయనేనంటూ పోస్టర్

Update: 2017-01-03 09:52 GMT
తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు మహా చిత్రంగా మారాయి. ఎప్పుడు ఎలాంటి పోస్టర్ బయటకు వస్తుందో అర్థం కాని పరిస్థితి. ఎవరికి వారు వారి మనసులోని మాటను చెప్పకుండా.. గుట్టుచప్పుడు కాకుండా పోస్టర్ వేసేస్తున్నారు. అమ్మ ఇక లేరన్నది కన్ఫర్మ్ అయిన కొద్ది రోజులకే పోస్టర్ రాజకీయాలు  తమిళనాడులో జోరందుకున్నాయి. ఎవరికి వారు వారి.. అభిమానాన్ని పోస్టర్ లో ప్రకటించేస్తున్నారు.

చివరకు చిన్నమ్మ సైతం ఇదే విధానాన్ని అమలు చేయటం గమనార్హం. అమ్మ తర్వాత చిన్నమ్మేనన్న విషయాన్ని ఫ్లెక్సీలతో.. పోస్టర్లతో శశికళ మద్దతుదారులు ప్రచారం ప్రారంభిస్తే.. దీనికి కౌంటర్ గా జయ మేనకోడలు దీపికను అన్నాడీఎంకే నాయకత్వం చేపట్టాలన్న పోస్టర్లు వెలువడ్డాయి. అయితే.. ఇప్పుడే కాదని ఆమె కాస్త వెనక్కి తగ్గటం తెలిసిందే.

పార్టీ ప్రధాన కార్యదర్శిగా చిన్నమ్మ బాధ్యతలు చేప్టటిన వెంటనే.. ఆమె ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలంటూ పెద్ద ఎత్తున పోస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా దర్శనమిచ్చాయి. ఇదిలా ఉంటే.. అనూహ్యంగా ఈ పోస్టర్ల యుద్ధంలోకి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చి చేరారు. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున రజనీ పోస్టర్లను అంటించటం ఇప్పుడు కొత్త కలకలానికి దారి తీస్తోంది. చెన్నై.. తిరుచ్చి.. మధురైతో పాటు పలు పట్టణాల్లో  అమ్మ స్థానాన్ని రజనీ చేపట్టాలంటూ పోస్టర్లు అచ్చేయటం ఇప్పడు ఆసక్తికరంగా మారింది.

అమ్మ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా రజనీకాంత్ కు మాత్రమే ఉందని.. ఆయన నిజాయితీ పాలనను అందిస్తారని అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న సందర్భాన్ని సద్వినియోగం చేసుకొని.. రజనీని రాజకీయాల్లోకి రావాలని కోరుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. మరి.. ఈ వ్యవహారంపై సూపర్ స్టార్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News