మరీ.. అలాంటి కంపు నిరసన కూడా చేస్తారా?

Update: 2015-03-20 07:32 GMT
తన కోపం నరం తెగిపోయిందని అప్పట్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. వైఎస్‌ ఎంతటి దూకుడు వ్యక్తో తెలిసిందే. అలాంటి వ్యక్తి తన కోపం నరం తెగిపోయిందన్న మాటలు చెప్పి అందరి నోళ్లలో నానారు. కానీ.. అదేం చిత్రమో వైఎస్‌ కోపం నరం తెగిపోయిందన్న నాటి తర్వాత నుంచి దేశవ్యాప్తంగా అందరి కోపం నరాలు శృతిమించిన స్థాయిలో బలమవుతున్నాయి.

తమకున్న ఆవేశాన్ని.. ఆవేదనను.. నిరసనను వ్యక్తం చేయటానికి చేస్తున్న చేష్టలు శృతిమించుతున్నాయి. తాజాగా జార్ఖండ్‌లోని 60 గ్రామాలకు చెందిన ప్రజలు చేసిన 'కంపు' నిరసన ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

భూసేకరణ బిల్లులో చేర్చిన వివాదాస్పద అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు వినూత్నమైన కంపు నిరసనను చేపట్టారు. భూసేకరణ చట్టంలో వారు వ్యతిరేకించే అంశాలు చూసిన తర్వాత వారి కంపు నిరసన గురించి మాట్లాడుకోవటం బెటర్‌. ఎందుకంటే.. ఆ కంపును భరించలేం మరి.

కీలకమైన ఐదు రంగాల్లో నిర్మించే ప్రాజెక్టులకు సామాజిక అంచనా తప్పనిసరి అన్న క్లాజ్‌ను తొలగించటమే కాదు.. భూసేకరణ చేపట్టే సమయంలో 80శాతం మేరకు భూ యజమానుల సమ్మతి అవసం లేదనే నిబంధనను కేంద్రం చేర్చింది. ఈ రెండు క్లాజుల వల్ల రైతులు తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశం ఉంది. దీనిపై వారు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదు.

దీంతో.. జార్ఖండ్‌లో నక్సల్స్‌ పట్టు ఉన్న అరవై గ్రామాల ప్రజలు.. బార్వాదీ బ్లాక్‌ కార్యాలయం ఎదుట సామూహికంగా బహిర్భూమి కార్యక్రమం నిర్వహించారు. బిల్లులో ఉన్న కంపు బయట పెట్టాలంటే తాము ఈ మాత్రం కంపు నిరసన చేయకుంటే కష్టమని భావించి ఇలా చేసినట్లు వారు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా వీరు చేపట్టిన కంపు నిరసన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Tags:    

Similar News