బిపిన్ రావత్ ఎంత తోపు అన్నది ఈ ఎపిసోడ్ ఒక్కటి చాలు

Update: 2021-12-10 11:30 GMT
దేశ అత్యున్నత త్రివిధ దళాధిపతిగా సుపరిచితుడైన బిపిన్ రావత్.. హెలికాఫ్టర్ ప్రమాదంలో అమరుడైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ధైర్యసాహసాలు.. తనకు అప్పగించిన బాధ్యత మీద ఆయనకున్న కమిట్ మెంట్.. దేశం మీద ఉన్నమమకారం లాంటి వాటిని చాటి చెప్పే ఉదంతాలు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒక ఉదంతాన్ని రావత్ తనకు తానే రివీల్ చేసుకున్నారు. ఇక.. కెరీర్ ముగిసినట్లే అనుకున్న స్థాయి నుంచి ఫినీక్స్ పక్షిలా ఎగిరిన ఈ వైనం గురించి తెలిస్తే.. బిపిన్ రావత్ ఎలాంటి వాడన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది.

దాదాపు 39 ఏళ్ల క్రితం.. మరింత సరిగ్గా చెప్పాలంటే 1993 మే 17. అప్పట్లో బిపిన్ రావత్ మేజర్ హోదాలో పని చేస్తున్నారు. అప్పటికి ఆయన వయసు 35 ఏళ్లు మాత్రమే. జుమ్మూ కశ్మీర్ లోని యురి ప్రాంతంలో గస్తీ విధుల్ని నిర్వర్తిస్తున్నారు. అప్పట్లో దాయాది పాక్ సైనికులు అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. అందులో ఒక తూటా నేరుగా ఆయన చీలమండలోకి దిగింది. లక్కీగా ఆయన కాలికి క్యాన్వాస్ యాంక్లెట్ అనే రక్షణ కవచం ఉంది. దీంతో.. తూటా ధాటికి నష్టం జరగకుండా కొంత మేర గాయమైంది. అది కూడా కాస్త పెద్దదే. బుల్లెట్ నేరుగా చీలమండలోకి దిగింది.

వెంటనే ఆయన్ను శ్రీనగర్ లోని సైనిక ఆసుపత్రికి తరలించారు. గాయం పెడుతున్న నొప్పి ఆయన్ను అస్సలు ఇబ్బంది పెట్టటం లేదు. ఆయన ఆలోచనలన్ని తన చీలమండలోకి దిగిన బుల్లెట్ కారణంగా తన కెరీర్ ఏమవుతుందన్న ఆందోళనే. గాయం కారణంగా తాను ఫిట్ నెస్ కు సరిపోకపోతే.. తర్వాత తానేం అవుతానన్న బాధే ఆయన్ను వేధించింది. గాయం పెద్దది అయితే.. మధ్యప్రదే్ లోని సైనిక శిక్షణ కేంద్రంలో సీనియర్ కమాండ్ కోర్సు చేయలేనని వేదన చెందారు.

ఎందుకిలా అంటే.. సైన్యంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే ఈ కోర్సు చాలా ముఖ్యం. ఈ బాధ ఇలా ఉంటే.. మరోవైపు ఆయన్ను పరామర్శించటానికి వచ్చినోళ్లు.. తెలిసిన వారు.. గాయంతో కెరీర్ ముగిసినట్లేనని వ్యాఖ్యలు చేసేవారు. అది ఆయనలో మరింత పట్టుదలను పెంచింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని వీడిపోకూడదని ఆయన డిసైడ్ అయ్యారు. ఊతకర్ర సాయంతో నడవటం షురూ చేశారు. నెల పాటు సెలవులు తీసుకున్నారు. తాను చేయాల్సినవన్నీ చేశారు.

సెలవులు ముగిసే నాటికి తనను తాను సిద్ధం చేసుకున్నారు. నేరుగా ఆర్మీ హాస్పిటల్ కు వెళ్లారు. అక్కడి వైద్యులు ఆయన్ను పరీక్షించి పూర్తిస్థాయి ఫిట్ నెస్ ఉన్నట్లుగా తేల్చారు. దీంతో.. ఆయనకు పోస్టింగ్ ఎక్కడ ఇవ్వాలన్న ప్రశ్న వచ్చింది. చివరకు యూరీలోనే విధులు నిర్వర్తించేందుకు ఓకే చెప్పారు. సరిహద్దుల వద్ద గస్తీ విధుల్ని నిర్వర్తించేందుకు మాత్రం కష్టమయ్యేది. కాల క్రమంలో చీలమండలం వద్ద గాయం తాలుకూ సమస్య సాధారణ స్థితికి వచ్చింది. అలా.. మొండితనంతో.. ఆత్మవిశ్వాసంతో.. తాను కన్న కలను సాకారం చేసుకోవటానికి ఎంతటి కష్టాన్ని అయినా భరించేందుకు సిద్ధమయ్యే బిపిన్ రావత్ లేకపోవటం దేశానికి తీరని లోటుగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News