డార్లింగ్ ని డిపెండ్ చేసేవాళ్లే లేరా?

Update: 2018-12-19 05:03 GMT
రాజు గారి మంత్ర‌దండం ఎటు విసిరితే అటే రంగు ప‌డుతుంది. ఆ మంత్ర‌దండం అటు తిరిగి ఇటు తిరిగి ఎటో వెళ్లిపోయినా వెళ్లిపోవ‌చ్చు. ఒక్కోసారి ల‌క్ష్యానికి దూరంగానూ ఎగిరిపోవ‌చ్చు. సినిమా- రాజ‌కీయం లింకుల విష‌యంలో ప‌రిశీలిస్తే ఇది ప‌దే ప‌దే ప్రూవ్ అవుతోంది. అధికార‌ పీఠం ద‌క్కించుకున్న పెద్ద‌ల అండ‌దండ‌ల‌తో సినీ సెల‌బ్రిటీల‌కు ఎన్నో ప‌నులు అవుతుంటాయి. ఏ వివాదాన్ని అయినా చాక‌చ‌క్యం గా ప‌రిష్క‌రించుకోవ‌డం సాధ్య‌మ‌వుతుంది. ఎంత ప్ర‌తికూలంగా ఉండే మంత్ర దండాన్ని అయినా త‌మ‌ కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో సినిమా వాళ్ల త‌ర్వాత‌నే.

కానీ ఎవ‌రో కొంద‌రికి మాత్ర‌మే ఇలాంటి విష‌యాల్లో చాణ‌క్యం కుద‌ర‌క‌పోవ‌చ్చు. ఆ వెన‌క‌బ‌డిన జాబితా లో డార్లింగ్ ప్ర‌భాస్ ఉన్నాడా?  ప‌రిశ్ర‌మ‌ లో అంద‌రికీ డార్లింగ్ అయిన ప్ర‌భాస్ ఎందుక‌ని త‌న‌కు వ‌చ్చిన పొలిటిక‌ల్ ఇబ్బందిని, స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోలేక‌పోతున్నాడు?  కొన్ని గుంట‌ల‌ భూమికి సంబంధించిన‌ ఒక చిన్న లిటిగేష‌న్‌ని ఎందుకు స‌మ‌ర్ధంగా ఎదుర్కోలేక‌పోతున్నాడు? ప‌్ర‌స్తుతం అభిమానుల్లో సందేహాలివి. రాజుగారి మంత్ర దండం త‌న‌నే టార్గెట్ చేయ‌డానికి కార‌ణ‌మేంటి?  దీనికి తానొక్క‌డే బ‌లి కావలెనా? అంటూ ఒక‌టే డార్లింగ్ ఫ్యాన్స్ అంతా తెగ ఇదైపోతున్నారు.

విక్ర‌మార్కా?  దీనికి తెలిసీ స‌మాధానం చెప్ప‌క‌పోయావో?  అంటూ భేతాళుడు తిరిగి చెట్టెక్కి కూచున్నాడు. ఇలా గులాబీ ద‌ళాలు మ‌రోసారి అధికారంలోకి రాగానే .. కోర్టు తీర్పు సైతం డార్లింగుకు ఫేవ‌ర్ గా లేకుండా పోయిందేంటో? ఇంత‌కుముందు సేమ్ స‌న్నివేశం ఎన్‌.క‌న్వెన్ష‌న్ అధినేత‌ కింగ్ నాగార్జున‌,  ప‌ద్మాల‌య అధినేత సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, శ‌బ్ధాల‌య అధినేత శ్యాంప్ర‌సాద్ రెడ్డి వంటి వాళ్లు ఎదుర్కొన్నారు. అయితే రాజుగారిని డీల్ చేసేలా డీల్ చేస్తే ఒక‌లా ఉంటుంది. రాజుగారి మంత్ర‌దండాన్ని తెలివిగా త‌న వైపు తిప్పుకోవ‌డంలోనే ఉంటుంది స‌మ‌ర్ధ‌త‌.

ఈ విష‌యంలో ప్ర‌భాస్ ఎలాంటి ట్యాలెంటు చూపిస్తాడో అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అయినా బాహుబ‌లుడికి లేని క‌నెక్ష‌న్ ఉందా?  అత‌డు త‌లుచుకుంటే ఇండ‌స్ట్రీనే క‌దిలొస్తుంది. ప్ర‌స్తుతం దిల్ రాజు- ఏషియ‌న్ నారంగ్ వంటి ప్ర‌ముఖులు త‌న‌కు సాయ‌ప‌డేందుకు సిద్ధంగా ఉన్నార‌ని తెలుస్తోంది. మ‌రి డార్లింగ్ మంత్ర దండాన్ని త‌న‌వైపు తిప్పుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డేం?  ప్ర‌య‌త్నిస్తే కొండ మీంచి కోతినైనా దించేయొచ్చు క‌దా?  కోతిని దించేయొచ్చు కానీ కోర్టు గొడ‌వ‌ల్లో క‌ష్టం క‌దా? అంటారా.. అన్న‌న్న ఈ పుచ్చ‌కాయ‌ నీతి క‌బుర్లు ఎవ‌రికి చెబుతున్నారు?


Tags:    

Similar News