ప్ర‌కాశం జిల్లాలో కలకలం..క్రికెటర్ల ఎంపికలో భారీ కుంభకోణం!

Update: 2019-10-18 18:57 GMT
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి తంతు... ఒక్క రాజధాని అమరావతికే పరిమితం కాలేదు. జిల్లాలకూ పాకింది. సాధారణ పాలనకే కాకుండా క్రీడా కారుల ఎంపికకూ పాకిపోయింది. ఈ తరహాలో వెలుగు చూసిన ఓ భారీ స్కాంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాలన్న డిమాండ్ ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కలకలం రేపుతోంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు అనుబందంగా కొనసాగుతున్న ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ లో చోటుచేసుకున్న ఈ నయా వ్యవహారం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ అవినీతి తంతుపై విజిలెన్స్ విచారణ చేపట్టాలంటూ క్రీడాకారుల తల్లిదండ్రులు నేరుగా జిల్లా కలెక్టర్ కే ఫిర్యాదు చేసిన వైనం ప్రకాశం జిల్లాలోనే కాకుండా యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా కలకలంగా మారిపోయిందని చెప్పాలి.

అసలు ఈ తంతు ఏమిటన్న విషయానికి వస్తే... ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గం ఏళ్ల తరబడి కొందరి చేతుల్లోనే కొనసాగుతోందట. ఈ క్రమంలో తమను అడిగే నాథుడు లేడన్న భావనతో అసోసియేషన్ అధ్యక్ష - ప్రధాన కార్యదర్శులు చేతి వాటం ప్రదర్శించారట. ఇందులో భాగంగా జిల్లా జట్టు ఎంపిక ప్రక్రియలో అవినీతికి తెర లేపారట. క్రికెట్ పై ఆసక్తి కలిగి... ఏళ్ల తరబడి కఠోర శ్రమ చేస్తూ క్రికెట్ లో నైపుణ్యం సంపాదించినా... జట్టులో చోటు లభించక చాలా మంది యువ క్రీడాకారులు ఆవేదనలో కూరుకుపోతే... డబ్బులిస్తే గానీ జట్టుకు ఎంపిక చేసేది లేదంటూ అసోసియేషన్ అధ్యక్ష - ప్రధాన కార్యదర్శులు క్రీడాకారుల పేరెంట్స్ తో బేరాలకు తెర తీశారట. ఈ క్రమంలో తమ పిల్లల భవిష్యత్తే ప్రధానంగా భావించిన చాలా మంది పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్ష - ప్రధాన కార్యదర్శులకు డబ్బులిచ్చి మరీ తమ పిల్లలకు జట్టులో సభ్యత్వం ఇప్పించుకున్నారట. ఏళ్లుగా అధ్యక్ష - ప్రధాన కార్యదర్శులుగా ఒకే వ్యక్తులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆటలో ప్రావీణ్యం సంపాదించినా... జట్టులో సభ్యత్వం దక్కకపోవడంతో పలువురి క్రికెటర్ల పేరెంట్స్ అసలేం జరుగుతోందని ఆరా తీయగా... అధ్యక్ష - ప్రధాన కార్యదర్శుల చేతివాటం బయటపడిందట.

జట్టులో ఎంపిక కోసం ఆటలో ప్రావీణ్యాన్ని కాకుండా క్రీడాకారుల పేరెంట్స్ ముట్టజెప్పే డబ్బు మూటలనే ప్రాతిపదికగా చేసుకున్న వైనం బయటపడింది. డబ్బుకు ఆశపడి కేవలం స్థానికులకే జట్టులో అవకాశం కల్పించాల్సి ఉండగా... నిబంధనలను తోసిరాజని నాన్ లోకల్ క్రీడాకారులకు కూడా జట్టులో అవకాశం కల్పించారట. అంతేకాకుండా తాజా కమిటీలో క్రికెట్ తో ఏమాత్రం సంబంధం లేని - క్రికెట్ లో ఓనమాలు తెలియని వారికి చోటు కల్పించేందుకు రంగం సిద్ధమైపోయిందట. దీంతో ప్లేయర్స్ తో పాటు పేరెంట్స్ కూడా ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఇలా ఒకరు - ఇద్దరు కాకుండా... చాలా మందే బాధితులు ఒక్కదరికి చేరిపోయారు. అంతా కూడబలుక్కుని కలెక్టర్ వద్దకు వెళ్లి అసోసియేషన్ లో జరుగుతున్న తంతును ఏకరువు పెట్టారు. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ చేత విచారణ చేపట్టాలని కూడా వారు కలెక్టర్ ను కోరారట. ఇప్పుడు ఈ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు కొత్తగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం అయినా ఈ వ్యవహారంపై దృష్టి సారించి అసోసియేషన్ అవకతవకలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.



Tags:    

Similar News