గబ్బర్‌ నీతి : అలా డప్పుకొట్టుకుంటున్నారు!

Update: 2015-09-16 04:25 GMT
'ఎవడి డప్పు వాడు కొట్టుకోండెహె' అనే మన గబ్బర్‌ సింగ్‌ సిద్ధాంతాన్ని రాజకీయ నాయకులు బాగానే వంటబట్టించుకుంటారు. అవకాశం దొరికితే చాలు.. ఎవడి డప్పు వాడు వాయించుకుంటూ చెలరేగిపోతుంటారు. అయితే భాజపాకు చెందిన ఢిల్లీ పెద్దలు కాస్త ఎక్కువ మేధావులు గనుక.. మన గబ్బర్‌ సింగ్‌ నీతిని కాస్త ఇంప్రొవైజ్‌ చేసి.. ప్రత్యర్థులు డప్పులు పగలకొట్టేయడం కూడా మన అవసరం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తమను తాము కీర్తించుకునేలా డప్పు వాయించడం మాత్రమే కాదు... కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీసేలా కూడా డప్పు వాయించుకోవడంపై దృష్టిపెడుతున్నారు.

భారతదేశంలో పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రాలు అనే కేటగిరీ కింద విడుదలైన జాబితాను ఆధారంగా చేసుకుని కాంగ్రెసు పార్టీ వారికే ప్రజారంజకమైన పాలన సాగించడం చేతకాదు అని అర్థం వచ్చేలా భాజపా విమర్శలను ప్లాన్‌ చేసుకుంటూ ఉండడం విశేషం. ఈ ప్రపంచ బ్యాంకు నివేదిక కాంగ్రెస్‌ పార్టీ ప్రతికూల రాజకీయాలకు నిదర్శనంగా ఉన్నదంటూ.. భాజపా అధికార ప్రతినిధి ప్రకాశ్‌ జవదేవకర్‌ విమర్శిస్తున్నారు.

ఈ ప్రపంచ బ్యాంకు నివేదికలో దేశంలో పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రాల్లో టాప్‌ ఫైవ్‌ లో నాలుగు స్థానాల్లో భాజపా పాలిత రాష్ట్రాలే ఉండడం తమ పార్టీ ప్రజారంజక పాలనకు నిదర్శనంలాగా ఆయన భాష్యం చెబుతున్నారు. ఈ నివేదికను ఆధారం చేసుకుని.. పేదరికం నిర్మూలనకు తాము కృషి చేస్తున్నామని అంటూనే.. కాంగ్రెస్‌ ఎప్పటికీ పేదలు పేదరికంలోనే మగ్గిపోవాలని కోరుకుంటుదని ఎద్దేవా చేశారు. అయితే పెట్టుబడులకు అనుకూల రాష్ట్రాలుగా ఎంపిక చేయడంలో.. ఆయా రాష్ట్రాల పారిశ్రామిక విధానాలు, పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణ - భౌగోళిక పరిస్థితులు - ఆ రాష్ట్రాల్లో అమలవుతున్న కార్మిక చట్టాలు ఇలాంటివి ప్రాతిపదికలుగా నివేదిక రూపొందిస్తారని వార్తలు వచ్చాయి అలాంటి నేపథ్యంలో ఆ రాష్ట్రాల పేదరిక నిర్మూలన అనే ఎజెండాను బట్టి జాబితా తయారైనట్లుగా ముడిపెట్టి మాట్లాడడడం ఎలా కుదిరిందో ప్రకాశ్‌ జవదేకరే చెప్పాలి.

నివేదికలు కావలిస్తే.. పూటకొకటి తయారుచేయవచ్చు. అయితే.. వాస్తవంగా పెట్టుబడులు వస్తున్నాయా లేదా అనేది ముఖ్యం. ఈ నివేదికలతో నిమిత్తం లేకుండానే తమిళనాడు రాష్ట్రానికి ఇటీవలే కొన్ని రోజుల వ్యవధిలోనే రెండు లక్షల కోట్ల రూపాయలు పైగా పెట్టుబడులు వరదలా వచ్చి పడిన సంగతి అందరికీ తెలిసిందే. కనుక ఇలా డప్పు కొట్టుకోవడానికి నేతలు పరిమితం కాకుండా.. ప్రాక్టికల్‌ గా.. పరిశ్రమలు పెట్టుబడులు వచ్చేలా వ్యవహరిస్తే బాగుంటుంది.
Tags:    

Similar News