కేంద్ర‌మంత్రి వ‌ర్సెస్ గంటా..ఏదినిజం.ఎవ‌రిది అబ‌ద్దం

Update: 2018-08-07 13:10 GMT
ఏది నిజం? ఎవ‌రిది అబ‌ద్దం?  కేంద్ర ప్ర‌భుత్వం త‌ప్పు చెప్తోందా?....రాష్ట్ర ప్ర‌భుత్వం నిజాలు దాస్తోందా? ఇది అంద‌రిలో నెల‌కొన్న సందేహం. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్ర‌చారం చూస్తున్న వారిలో క‌లుగుతున్న‌ అనుమానం ఇది. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ తరగతులను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రారంభించిన సంద‌ర్భంగా నెల‌కొన్న హ‌డావుడి సంద‌ర్భంగా క‌లిగిన భావ‌న ఇది. అబ‌ద్దాలు చెప్తోంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వామా లేక అండ‌గా నిలిచామ‌ని ప్ర‌క‌టించుకుంటున్న బీజేపీ స‌ర్కారా? అనేది అనేక‌మందికి అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే....రాష్ట్ర విభజన చట్టంలో రూపొందించిన హామీల్లో ఒకటైన సెంట్రల్ యూనివర్సిటీని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రారంభించారు. అనంతపురం జేఎన్టీయూ ప్రాంగణంలోని ఐటీ ఇంకుబేషన్ భవనంలో సెంట్రల్ యూనివర్సిటీ తాత్కాలిక తరగతులను జవదేకర్ లాంఛనంగా ప్రారంభించారు. సెంట్రల్‌ యూనివర్సిటీ తరగతులను ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో నిర్వహించిన బహిరంగ సభలో జవదేకర్ పాల్గొన్నారు. ఏపీని కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటోందని చెప్పారు. ఏపీలో రాష్ట్ర విభజన సమస్యలు ఉన్నాయనేది వాస్తవమేన‌ని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి   కేటాయించిన 7వర్సిటీలకు వందల కోట్లు ఇచ్చామన్నారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. త్వరలో సెంట్రల్‌ వర్సిటీ భవనాలకు శంకుస్థాపనలు చేస్తామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర‌మంత్రి జవదేకర్ అవాస్తవాలు చెప్పారన్నారు. కేంద్ర వర్సిటీలు కేవలం భూమిపూజకు మాత్రమే నోచుకున్నాయన్నారు. కేంద్రం కేటాయించిన నిధుల్లో కేవలం 10 శాతం మాత్రమే వచ్చాయన్నారు. 7వర్సిటీలకు 3 వేల 508 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందన్నారు. వర్సిటీలకు ఇచ్చిన నిధులపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్  చేశారు.

అయితే, ఒకే వేదిక‌పై ఒకే అంశానికి సంబంధించి అది కూడా మంత్రుల స్థాయిలో ఉన్న నాయ‌కులు పూర్తి ప‌ర‌స్ప‌ర విరుద్ధ‌మైన ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఎంతో చేశామ‌ని కేంద్ర మంత్రి చెప్తుంటే...ఏపీ మంత్రి అదేం లేదంటున్నారు. ఈ స‌మ‌యంలో స‌హ‌జంగానే ప‌లువురి దృష్టి జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పై ప‌డుతోంది. కేంద్రం ఇచ్చిన నిధులు...రాష్ట్రం పొందిన సొమ్ముల‌పై నిజాలు తేల్చేందుకు జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ క‌మిటీ పేరుతో ఓ వేదిక ఏర్పాటు చేసి ప‌వ‌న్ హ‌డావుడి చేసిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌కీ ప‌వ‌న్ ఏం తేల్చారు? ఆ స‌మావేశం వ‌ల్ల క‌లిగిన ఫ‌లితం ఏంట‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్నే!
Tags:    

Similar News