బాబు త‌ప్పుడు నిర్ణ‌యం తీసుకున్నారా?

Update: 2016-07-17 09:57 GMT
కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు ...ఇపుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో హాట్ టాపిక్‌. చాప‌కింద నీరులా సాగుతున్న ఈ ప్రాజెక్టు వ్య‌తిరేక ఆందోళ‌న ఇపుడు ఉధృతం రూపం దాల్చుతోంది. ఏకంగా సీపీఎం మాజీ జాతీయ‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రకాశ్ కారత్ క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి నిర్వాసితుల‌కు మ‌ద్ద‌తిచ్చే స్థాయికి చేరింది. అంతేకాకుండా అణువిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో జ‌రిగే న‌ష్టం గురించి ఆయ‌న వివ‌రించిన తీరుతో స్థానికుల్లో వ‌చ్చిన స్పంద‌న చూస్తుంటే...బాబు కోరి ఇక్క‌ట్లు తెచ్చుకుంటున్నార‌నే చ‌ర్చ న‌డుస్తోంది.

సీపీఎం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌కు ప్రకాష్ కారత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో కొవ్వాడ ప్రాంతంలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు ప్రదేశంలో పర్యటించిన‌ట్లు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా ఆరు అణు రియాక్టర్లు ఏర్పాటు చేయలేదని - కొవ్వాడలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఒకే ప్రదేశంలో ఆరు రియాక్టర్లు ఏర్పాటు చేస్తే..ఒక్క కొవ్వాడ ప్రాంతమే కాకుండా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకూ తీవ్రమైన పెను ప్రమాదం పొంచి ఉంటుందన్నారు.  అమెరికా - జపాన్ దేశాల్లో అణు విద్యుత్ కేంద్రాలను నియంత్రించారని - గుజరాత్‌ లో అణువిద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్నారని, దానినే కొవ్వాడలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధం అయినట్లు కారత్ ఆరోపించారు. సాధారణ విద్యుత్ కంటే అణు విద్యుత్ ఖరీదు చాలా ఎక్కువన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ లో కావల్సినన్ని బొగ్గు నిక్షేపాలు వున్నాయనీ, వాటి ద్వారా థర్మల్ విద్యుత్‌ ను తయారు చేసుకోవచ్చన్నారు. అలాగే సోలార్ సిస్టమ్ ద్వారా కూడా విద్యుత్ తయారు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. ఇన్ని అవకాశాలను వదిలి అణువిద్యుత్ కోసం పాకులాడాల్సిన అవసరం లేదన్నారు.

జపాన్‌ లో అణు రియాక్టర్లు పేలి ఎంత విధ్వంసం జరిగిందో మనందరికీ తెలుసనీ - అటువంటి ప్రమాదకర అణు రియాక్టర్లను ఈ ప్రదేశంలో ఏర్పాటు చేయటం పెను ప్రమాదానికి దారితీస్తాయన్నారు. అణు రియాక్టర్లలో చిన్న ప్రమాదం జరిగినా ఉత్తరాంధ్ర జిల్లాలు శ్మశానాలవుతాయని హెచ్చ‌రించారు. ఈ విషయాన్ని పేర్కొంటూ గతంలో మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచీ సీపీఎం పోరాడుతోందన్నారు. తాజాగా చంద్ర‌బాబు  ప్రభుత్వం అమెరికాకు చెందిన కంపెనీతో ఒప్పందం కుదర్చుకోవటానికి యత్నిస్తోందన్నారు. దీనికి సంబంధించి పెట్టుబడి రూ. 2 లక్షల 80 వేల కోట్లు అవుతుందనన్నారు.  అమెరికా - ఫ్రాన్స్ - జర్మనీ దేశాలలో అణు విద్యుత్ కేంద్రాలను ఎత్తివేస్తున్నారని తెలిపారు. రానున్న కాలంలో కూడా తాము అణువిద్యుత్‌ ను తయారు చేయమని జర్మనీ నిర్ణయం తీసుకుందని కారత్ పేర్కొన్నారు. గుజరాత్‌ లో అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణం వద్దని అక్కడి ప్రజలు పోరాటం చేశారని - అందుకే ప్రధానమంత్రి మోదీ ఆ ప్లాంటును ఆంధ్రాలో నెలకొల్పటానికి సిద్ధపడుతున్నారని కారత్ ఆరోపించారు.
Tags:    

Similar News