కేసీఆర్ కూటమికి మైనస్ గా ప్రకాశ్ రాజ్?

Update: 2022-02-21 03:41 GMT
సెక్యులరిజం అంటూ తరచూ కబుర్లు చెప్పే బ్యాచ్ ఒకటి రాజకీయాల్లో కనిపిస్తూ ఉంటుంది. వారి మాటలు.. ఆదర్శాలు ఆకాశాన్ని అంటేలా ఉంటాయి. చేతలకు వచ్చేసరికి మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. నిజానికి సెక్యులరిజం మాటల్ని చెబుతూ రాజకీయం చేసిన వారి కారణంగానే ఈ రోజున మోడీ లాంటి నేత దేశంలోని మెజార్టీ ప్రజలు ఆయనకు నీరాజనం పడుతున్నారని చెప్పాలి.

ఎందుకంటే.. స్వతంత్ర భారతంలో మెజార్టీలను.. వారి మనోభావాల్ని అస్సలు పట్టించుకోని కాంగ్రెస్.. వామపక్ష భావజాల నేతల పుణ్యమా అని దేశంలో విభజన రేఖకు కారణమైందని చెప్పాలి. బలీయంగా ఉండే మైనార్టీ ఓటు బ్యాంకును సొంతం చేసుకోవటానికి.. వారి ఓట్లను దండుకోవటం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవటానికి వీలుగా వ్యవహరించే రాజకీయ పార్టీల తీరును చూసి.. చూసి విసిగిపోయిన కోట్లాది మందికి తమ గురించి మాట్లాడే బీజేపీ వైపు ఆకర్షితులయ్యారని చెప్పాలి.

ఇప్పటికి.. లౌకికవాదం.. పేరుతో ఆదర్శాలు.. సిద్ధాంతాలు వల్లె వేసే వారు.. అందరిని సమానంగా చూడాలన్న చిన్న పాయింట్ ను పట్టించుకోకుండా ఓటు బ్యాంకు రాజకీయాల్ని ప్రోత్సహించేలా వ్యవహరించటం.. తమను ఎవరూ పట్టించుకోవటం లేదన్న కొరతను క్యాష్ చేసుకోవటానికి మోడీ అండ్ కో లాంటి వారు రంగంలోకి దిగి విజయవంతం అవుతున్నారు. ఈ దేశంలో ఇప్పుడు కావాల్సింది మెజార్టీలు.. మైనార్టీలను ఒకే విధంగా చూడటం.. ఒకరిని ఎక్కువగా.. మరొకరిని తక్కువగా చూడటం అన్నది ఉండకూదు. ఈ వాదన చాలామందికి రుచించకపోవచ్చు.

కానీ.. ఈ ప్రయత్నం చేయకపోతే.. మెజార్టీలు.. మైనార్టీల మధ్య దూరం పెరిగిపోవటమే కాదు.. ఎవరికి వారు వారి ప్రయోజనాలకు తగ్గట్లు రాజకీయాలు చేసి.. ప్రజల మధ్య దూరాన్ని పెంచేస్తుంటారు. ఇలాంటి వారికి నిలువెత్తు రూపంగా సినీ నటుడు.. మేధావిగా చెప్పుకునే ప్రకాష్ రాజ్ ఒకరు. సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి.. అడ్డంగా ఫెయిల్ అయిన ఆయన ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కు ఉత్తరాది నేతలకు మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన కేసీఆర్ కు.. ప్రకాశ్ రాజ్ అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరించటం అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. ఎందుకంటే.. కేసీఆర్ మహా పర్యటనలో ప్రకాశ్ రాజ్ ఒక్కసారిగా దర్శనమివ్వటం.. దాన్ని ఎవరూ ఊహించకపోవటంతో అందరిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. ఇదిలా ఉంటే.. ప్రకాశ్ రాజ్ ఎంట్రీతో ఇప్పటివరకు కేసీఆర్ వాదనకు మద్దతు ఇచ్చేవారు.. ఆయన మాటలకు ప్రభావితమయ్యే వారు పునరాలోచనలో పడటం ఖాయమని చెప్పక తప్పదు. ఎందుకంటే.. ఒకవైపు మొగ్గినట్లుగా వ్యవహరించే ప్రకాశ్ రాజ్ భావజాలం పలువురిని కేసీఆర్ కు దూరం చేయటం ఖాయం.

నిజానికి ప్రకాశ్ రాజ్ వ్యక్తిగతంగా చాలా మంచివారు. ఆయన్ను అభిమానించే వారు సైతం ఆయన రాజకీయ భావజాలానికి మాత్రం మద్దతు ఇచ్చేందుకు ఇష్టపడరు. అలాంటిది.. కేసీఆర్ లాంటి వారు.. ప్రకాశ్ రాజ్ ను తమ కూటమిలో కలుపుకోవటం ద్వారా.. ఆయనకు అండగా నిలుద్దామనుకునే వారు సైతం పునరాలోచనలో పడటం ఖాయమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News