ప్ర‌కాష్‌ రాజ్ కి నాలుగు చోట్ల ఓటుహ‌క్కు?

Update: 2019-03-29 05:33 GMT
`జ‌స్ట్ ఆస్కింగ్` అనే హ్యాష్ ట్యాగ్‌ తో కేంద్ర ప్ర‌భుత్వాన్ని, ప్ర‌ధాని మోదీని గ‌త నాలుగేళ్లుగా క‌డిగిపారేస్తున్నారు విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌ రాజ్‌. గ‌త కొంత కాలంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌దైన స్టైల్లో స్పందిస్తూ ఆస‌క్తిరేకెత్తించిన ప్ర‌కాష్‌ రాజ్ ఈ లోక్‌ స‌భ ఎన్నిక‌ల వేళ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీకి దిగిన విష‌యం తెలిసిందే. బెంగ‌ళూరు సెంట్ర‌ల్ నుంచి పోటీప‌డుతున్న ఆయ‌న‌పై  అప్పుడే ఆరోప‌ణ‌ల ప‌ర్వం మొద‌లైంది. ఆయ‌న‌పై ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్ర‌కాష్‌ రాజ్ అభ్య‌ర్థిత్వాన్ని ర‌ద్దు చేయాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి జె. జ‌గ‌న్‌ కుమార్ ఎన్నిక‌ల సంఘాన్ని ఆశ్ర‌యించ‌డం బెంగ‌ళూరు రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.  

తాను శాంతి న‌గ‌ర్‌ లో వుంటున్న‌ట్లు ఎన్నిక‌ల క‌మీష‌న్‌ కు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌ లో పేర్కొన్నార‌ని, అయితే ఆయ‌న‌కు ఇక్క‌డ ఒక‌టి,  చెన్నైలో రెండు, తెలంగాణలో ఒక‌చోట ఓటు హ‌క్కు వుంద‌ని ఆ విధంగా ఇక్క‌డ పోటీ చేయ‌డానికి ప్ర‌కాష్‌ రాజ్ అన‌ర్హుడ‌ని జ‌గ‌న్‌ కుమార్ ఈసీకి ఫిర్యాదు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక్క‌డి నుంచి ఆయ‌న పోటీ చేయాలంటే మిగ‌తా చోట్ల వున్న త‌న ఓటు హ‌క్కును ర‌ద్దు చేసుకోవాల‌ని, అయితే ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు త‌న ఓటును తొల‌గించ‌మ‌ని అధికారుల‌కు ఆర్జీ పెట్టుకోలేద‌ని వివ‌రించారు.

ఒక వ్య‌క్తికి ప‌లు చోట్ల ఓటు హ‌క్కు వుండ‌టం చ‌ట్ట‌రిత్యా నేర‌మ‌ని, ఈ విష‌యంలో ఈసీ జోక్యం చేసుకోవాల‌ని జ‌గ‌న్‌ కుమార్ న‌టుడు ప్ర‌కాష్‌ రాజ్‌ ను ఇరుకున‌పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. అయితే సెల‌బ్రిటీల‌కు అయినా.. లేదా సామాన్యుడికైనా ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ ప‌రిధిలో ఒకే న్యాయం జ‌ర‌గాల్సి ఉంది. మ‌రి ఈసీ దీనిని సీరియ‌స్ గానే ప‌రిగ‌ణిస్తుంద‌నే భావిస్తున్నారంతా.
Tags:    

Similar News