మోదీకి ప్ర‌కాశ్ రాజ్ మ‌రో పంచ్ వేశారే!

Update: 2017-12-18 08:38 GMT
న‌టుడిగా త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న ద‌క్షిణాది భాషా చిత్రాల న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఇటీవ‌లి కాలంలో రాజకీయాల‌పైనా ప‌డిపోతున్నారు. క‌న్నడిగుడైన ఈ విల‌క్ష‌ణ న‌టుడు... త‌న రాష్ట్రం క‌ర్ణాట‌క‌తో పాటుగా తెలుగు - త‌మిళ‌ నేల రాజ‌కీయాలు మాట్లాడ‌టంతోనే స‌రిపెట్ట‌డం లేదు. ఏకంగా జాతీయ పార్టీ అయిన బీజేపీని కూడా ఆయ‌న న‌డిరోడ్డు మీద‌కు ఈడ్చుకుని వ‌చ్చేస్తున్నారు. చోటా మోటా నేత‌ల‌తో ప‌ని కాద‌నుకున్నారో - ఏమో తెలియ‌దు గానీ... ఏకంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ ఇటీవ‌లి కాలంలో ప్ర‌కాశ్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోష‌ల్ మీడియా వేదిక‌గానే కాకుండా నేరుగా మీడియా ముందుకు వ‌చ్చేస్తున్న ఆయ‌న ప్ర‌ధానికి సూటి ప్ర‌శ్న‌లు సంధిస్తూ బీజేపీ శ్రేణుల్లో ఆగ్ర‌హావేశాలు పెల్లుబికేలా చేస్తున్నార‌నే చెప్పాలి. నేరుగా ప్ర‌ధానిని టార్గెట్ చేస్తున్న ప్ర‌కాశ్ రాజ్ వ్య‌వ‌హార శైలిపై కర్ణాట‌క‌కు చెందిన ఓ యువ బీజేపీ ఎంపీ చాలా ఘాటు వ్యాఖ్య‌లు కూడా చేసిన విష‌యం తెలిసిందే.

బీజేపీ నేత‌ల నుంచి ఎదుర‌వుతున్న హెచ్చ‌రిక‌ల‌ను కూడా ఖాత‌రు చేయ‌ని ప్ర‌కాశ్ రాజ్‌... ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తూ... ఆయా స‌మ‌యాల్లో బ‌ర్నింగ్ ఇష్యూలుగా న‌లుగుతున్న స‌మ‌స్య‌ల‌పై మోదీకి *జ‌స్ట్ ఆస్కింగ్* పేరిట ప్ర‌శ్నాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఇప్పుడు కూడా ఆయ‌న అదే త‌ర‌హా వైఖ‌రిని అవ‌లంబించారు. ఓ వైపు గుజ‌రాత్ - హిమాచల్  ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఆనందంలో ఉన్న ప్రధానికి చిర్రెత్తుకొచ్చేలా చేస్తున్న ప్ర‌కాశ్ రాజ్‌... మోదీ సొంత రాష్ట్రం గుజ‌రాత్‌ లో బీజేపీ గెలుపు... గెలుపే కాద‌న్న కోణంలో ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. అస‌లు గుజ‌రాత్‌ లో ద‌క్కిన విజ‌యంపై మీ స్పంద‌న ఏమిటంటూ ప్ర‌కాశ్ రాజ్ విసిరిన క్వ‌శ్చన్‌ కు బీజేపీ నేత‌లు ఎలా స్పందిస్తారో తెలియ‌దు గానీ... ఆ పార్టీ నేత‌లు మాత్రం ప్ర‌కాశ్ రాజ్ వ్య‌వ‌హార శైలి కార‌ణంగా మరోమారు ఫైర్ కాక త‌ప్ప‌ని ప‌రిస్థితిని ప్ర‌కాశ్ క‌ల్పించార‌నే చెప్పాలి.

అయినా విజ‌యం సాధించిన మోదీకి ప్ర‌కాశ్ రాజ్‌ ట్విట్ట‌ర్ వేదిక‌గా సంధించిన ప్ర‌శ్న‌ల విష‌యానికి వ‌స్తే... బీజేపీ విజ‌యం నేప‌థ్యంలో తొలుత ప్ర‌ధాని మోదీకి అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌కాశ్‌ రాజ్... అక్క‌డితోనే ఆగ‌కుండా త‌న‌దైన పాత శైలిలో కొన్ని ప్ర‌శ్న‌లు అడిగారు. ప్ర‌కాశ్ రాజ్ ట్వీట్ ఎలా సాగిందంటే... *ప్రియ‌మైన ప్రధాన‌మంత్రిగారూ.. విజ‌యం సాధించినందుకు అభినంద‌న‌లు. కానీ, ఈ ఫ‌లితాల‌తో నిజంగా మీరు సంతోషంగా ఉన్నారా? 150 ప్ల‌స్ సీట్లు సాధిస్తామ‌న్నారు క‌దా.. ఏమైంది? ఒక‌సారి సింహావ‌లోక‌నం చేసుకోండి. స‌మ‌స్య‌లు ఎక్క‌డున్నాయో తెలుసుకోండి. విభ‌జ‌న రాజ‌కీయాలు ప‌నిచేయ‌లేదు. గ్రామీణుల‌ను - పేద‌ల‌ను - రైతుల‌ను నిర్ల‌క్ష్యం చేశారు. వారి గొంతు బిగ్గ‌ర‌గా వినిపిస్తోంది.. మీరు వింటున్నారా` అని ప్ర‌కాశ్ రాజ్.. మోదీని దాదాపుగా నిల‌దీసినంత ప‌నిచేశారు. మ‌రి ఈ ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌శ్న‌ల‌కు బీజేపీ నుంచి ఎలాంటి స‌మాధానం వ‌స్తుందో చూడాలి.
Tags:    

Similar News