క‌న్న‌డ ఎన్నిక‌ల్లో కొత్త హీట్ సృష్టిస్తున్న ప్ర‌కాశ్

Update: 2018-04-27 11:00 GMT
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు హీటెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ - ప్ర‌తిప‌క్ష బీజేపీ త‌మ‌దైన శైలిలో ప్ర‌త్య‌ర్థుల‌ను టార్గెట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నామినేష‌న్ల దాఖ‌లు ముగిసిన నేప‌థ్యంలో ప్ర‌చారం హోరెత్తిస్తూ రాష్ర్టాన్ని చుట్టేస్తున్నారు. స‌హ‌జంగా రాజ‌కీయాల్లో ఉండే వ్య‌క్తులు ఎదురుదాడులు చేయ‌డం  ఒక‌రిని ల‌క్ష్యంగా చేసుకొని ముందుకు సాగ‌డం తెలిసిన సంగ‌తే. అయితే గ‌త కొద్దికాలంగా త‌న‌కే పార్టీతో సంబంధం లేద‌ని ప్ర‌క‌టిస్తూనే బీజేపీపై సినీ యాక్టర్ ప్ర‌కాశ్ రాజ్ ఎదురుదాడి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే స్టార్స్ లో ప్రకాశ్‌ రాజ్ ఒకరు. ప్రకాశ్‌ రాజ్ తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేసి కాషాయ పార్టీపై ఎదురుదాడి చేశారు.

క‌న్న‌డ ఎన్నిక‌ల నేప‌థ్యంలో జ‌రుగుతున్న ప్ర‌చారంపై ప్ర‌కాశ్‌ రాజ్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ``దేశంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. దేశంలో హిందుత్వ వాదం బలపడాలంటే.. హిందువులు తలెత్తుకొని గౌరవంగా తిరగాలంటే.. కర్ణాటకలో బీజేపీని గెలిపించాలని బీజేపీ అభ్యర్థుల సతీమణులు ఓటర్లను వేడుకొంటున్నారు. దక్షిణ మంగళూరు బీజేపి అభ్యర్థి వేదవ్యాస్ కామత్ర భార్య గ్రామాల్లో పర్యటిస్తూ ఇలా వినూత్నమైన ప్రచారం చేస్తోంది. సబ్కా సాత్ .. సబ్కా వికాస్ అంటే ఇలా హిందుత్వ వాదాన్ని బలపరచడమేనా?`` అని సోషల్ మీడియా సాక్షిగా ప్రకాశ్‌ రాజ్ ప్రశ్నిస్తున్నారు. కాగా దీనిపై బీజేపీ శ్రేణులు త‌మ‌దైన శైలిలో స్పందించాయి. లౌకిక‌త్వం అంటే హిందూ మ‌తాన్ని విమ‌ర్శించ‌డమేనా? త‌ట‌స్థం అంటే బీజేపీపై మండిప‌డట‌మా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

ఇదిలాఉండ‌గా...కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోను ఇవాళ విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగుళూరులో ఎజెండాను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం సిద్ధిరామయ్య, డాక్టర్ జీ పరమేశ్వర - సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఎన్నో పథకాలను కర్నాటకలో మొదటిసారి ప్రవేశపెట్టినట్లు ఆ మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. వ్యవసాయం - విద్య - క్రీడలు - సంస్కృతి - సుపరిపాలన - ఇన్‌ ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు అనేక అంశాల గురించి మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. నవ కర్నాటక పేరుతో మ్యానిఫెస్టోను రిలీజ్ చేశారు.
Tags:    

Similar News