కాంగ్రెస్ రివర్స్ ప్లాన్ - ఆ ముగ్గురి కోసం

Update: 2019-05-16 14:00 GMT
ఒకప్పుడు రాహల్ ని ప్రధానిని చేయాలన్నది మాత్రమే సోనియాగాంధీ కోరికగా ఉండేది. కానీ ఇపుడు ఆమెకు ఇంకో కోరిక కూడా ఉంది. నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని కానివ్వకూడదన్నదే ఆమె మరో ప్రధాన కోరిక. మొదటిది జరగాలంటే రెండోది ముందు జరగాలి. మరి ఇపుడున్న పరిస్థితుల్లో ప్రధాని అభ్యర్థులు చాలా ఎక్కువ మందే ఉన్నారు. దక్షిణాది నుంచి కేసీఆర్ - బెంగాల్ నుంచి మమత - యూపీ నుంచి మాయావతి ప్రధాని పదవి కోరుతున్నారు. మహారాష్ట్ర నుంచి శరద్ పవార్ - మమత ఇద్దరు తాము అయినా కాకపోయినా రాహుల్ అయితే వద్దంటున్నారు. వీరందరి మధ్య చంద్రబాబు... ఏం జరిగినా ఓకే గానీ మోడీ మాత్రం మళ్లీ కాకూడదు - రాకూడదు అంటున్నారు. అందుకే కాంగ్రెస్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ ఏకతాటిపై నిలబడితేనే మోడీని అడ్డుకోగలరు. ఇపుడు దానికి ఏం చేయాలి? అన్నదే కాంగ్రెస్ ప్రధానమైన మథనం.

రాహుల్ కి వయసుంది. ఇంకోసారి ఎపుడైనా ప్రధానిని చేసుకోవచ్చు. కానీ ఈసారి ఛాన్స్ వదులుకోకుండా అధికారం చేపట్టాలి. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవాలి. దానికి ఉన్న ఒకే ఒకమార్గం అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి ఒకరు కావాలి. ఇపుడు కాంగ్రెస్ లో ఆ స్థాయి నాయకుడు ఎవరూ లేరు. అందుకే సంప్రదాయానికి విరుద్దంగా - చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఒక మాజీ రాష్ట్రపతిని ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయ్యింది. దీనివల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఆయన ఎవరో అర్థమైంది కదా.... దాదా ప్రణబ్ ముఖర్జీ. ఒక్క దెబ్బకు అన్ని పిట్టలు అన్నట్టు... ప్రణబ్ ను ప్రధాని గా చేయడానికి రెడీ ముందు మమత వల్ల ఇబ్బంది ఉండదు. అదే రాష్ట్రం పెద్దాయన కాబట్టి మమత ఆమోదించే అవకాశాలున్నాయి.

ఇక శరద్ పవార్ గాని - అఖిలేష్ వంటి వారు గాని కాదనే పరిస్థితులు ఉండవు. అయితే, అఖిలేష్ యాదవ్ మాత్రం మాయావతి ప్రధాని అయితే బాగుంటుందని చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు. ఆమె కూడా ఇపుడు కాకపోతే ఇంకెపుడు అనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరికి వచ్చే సీట్లను బట్టి భవిష్యత్తు నిర్ణయం ఉంటుంది. కాకపోతే ప్రణబ్ కు ఏదో ఒక క్షణంలో మాయావతి తగ్గే అవకాశాలుంటాయి.  ఎందుకంటే తను మద్దతు ఇవ్వకపోతే మళ్లీ మోడీ ప్రధాని అయ్యే అవకాశం ఉందంటే... అదేదో ప్రణబ్ ని చేయడమే మంచిదని ఆమె భావించే అవకాశం లేకపోలేదు. కాకపోతే అఖిలేష్ కు ఒక స్వార్థం ఉంది. మాయావతిని సెంట్రల్ కి పంపిస్తే... ఆమె ఓట్లన్నీ రాష్ట్రంలో తనకే... ఎప్పటికీ సీఎం నేనే ఇక భవిష్యత్తులో అని అఖిలేష్ కలలు కంటున్నారు. అయినా కూడా ప్రణబ్ వంటి పెద్దాయనను అఖిలేష్ కాదని చెప్పే సాహసం చేయరు.

ఇక కేసీఆర్ - జగన్ - చంద్రబాబులు కూడా ప్రణబ్ అంటే ఇష్టపడతారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ప్రణబ్ ప్రధాని అభ్యర్థి అయితే చాలా మద్దతు దొరికే అవకాశం ఉంది. ట్విస్ట్ ఏంటంటే... ఇదే ఆలోచన కనుక సోనియాగాంధీ రెండు నెలల క్రితం తీసుకుని ఉంటే... కచ్చితంగా కాంగ్రెస్ మెరుగైన సీట్లు సాధించేది. మరి ఇప్పటివరకు ఈ ఆలోచన ఎందుకు చేయలేదో ఆశ్చర్యకరమే. అయితే, ఏదయినా మే 23 ఫలితాల తర్వాత సమీకరణాలు ఎట్లా ఉంటాయో అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే... ప్రణబ్ ప్రధాని అభ్యర్థి అనేది ఇంకా అధికారిక ప్రకటన కాదు. పైగా ఆ పదవిపై కోరిక ఉన్నా కూడా రాష్ట్రపతి అయ్యాక చంపేసుకున్నాడు. మరి మళ్లీ ఇపుడు ఆయన ఏమంటాడు అన్నది కూడా పాయింటే.

సంప్రదాయమే ప్రధాన సమస్య...

ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో రాష్ట్రపతి అయ్యాక ఎవరూ ప్రధాన రాజకీయ స్రవంతిలోకి రాలేదు. ఎందుకంటే ఆ పదవే దేశంలో అత్యున్నతమైనది. ఆ పదవి నిర్వహించిన తర్వాత దాని కంటే ప్రొటోకాల్ ప్రకారం కింది స్థాయి పదవికి పోటీ పడటం అంతర్జాతీయంగా కూాడా పలువురిని ఆశ్చర్యానికి గురిచేసే అవకాశం ఉంటుంది. అయితే వెసులుబాటు మాత్రం ఉంది. ఎందుకంటే రాష్ట్రపతిగా చేసిన వ్యక్తి ప్రధానిగా చేయకూడదని రాజ్యాంగంలో పేర్కొనలేదు. మే 23న ఫలితాల తర్వాత జరిగే నాన్ ఎన్డీయే సమావేశంలో ప్రణబ్ ముఖర్జీ పేరును సోనియా ప్రతిపాదిస్తారా? లేదా ? అన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News