తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత - ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యమపంథా తెరిచిన పుస్తకమే. 14 ఏళ్ల పాటు తాను నమ్మిన సిద్ధాంతాన్ని పాటించి సుదీర్ఘ పోరాటం చేసి...తెలంగాణ రాష్ట్రం కల నెరవేరడంలో కేసీఆర్ కీలక భూమిక పోషించారు. తనతో కలిసివచ్చే వారితో ముందుకు సాగి ఉద్యమించడమే కాకుండా...అవకాశం వచ్చినపుడు పదవులను కూడా అలంకరించారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం - అటు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అవడమే కాకుండా వాటిని తన రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా కేసీఆర్ పక్కనపెట్టేశారు కూడా! అలా గులాబీ దళపతి చేసిన ప్రయాణానికి మరోమారు కితాబు దక్కింది. మాజీ రాష్ట్రపతి - కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం ఉన్న ప్రణబ్ ముఖర్జీ స్వరాష్ట్ర సాధనలో కేసీఆర్ పంథాను కొనియాడారు.
మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తన రాజకీయ అనుభవాన్నంతా రంగరించి నాటి - నేటి నేతల తీరుతెన్నులను కూలంకషంగా విశ్లేషిస్తూ ‘సంకీర్ణ శకం’ అనే పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకం జాతీయ - అంతర్జాతీయ నేతల గురించి, వారి వ్యవహారశైలి గురించి తన రాజకీయంలోని కీలక ఘట్టాల గురించి ప్రణబ్ జీ వివరించారు. ఇందులో ఓ చోట తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఓ సందర్భంలో తనతో కేసీఆర్ ప్రత్యేకంగా చర్చించిన విషయాన్ని ప్రస్తావిస్తూ...`ప్రణబ్ జీ..నా లక్ష్యం ఏంటో మీకు తెలుసు. నాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి. కేంద్ర మంత్రి వర్గంలో మీరు నాకు ఏ శాఖ ఇచ్చినా పర్లేదు. కానీ నా చిరకాల వాంచ అయిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును మాత్రం సాకారం చేయండి`` అని కోరారట.
ప్రణబ్ రాసిన పుస్తకంలో కేసీఆర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం, అందులోనూ గులాబీ దళపతి కేంద్ర మంత్రి పదవి తనకు అంతముఖ్యమైనదేమీ కాదన్నట్లుగా చెప్పడం ఆసక్తికరమైదని పేర్కొనడంతో...టీఆర్ఎస్ రథసారథి పోరాటం గురించి మరోమారు గులాబీ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.