ఇందిరను పొగిడారు.. రాజీవ్ ను తప్పు పట్టారు

Update: 2016-01-29 04:09 GMT
దేశ ప్రధమ పౌరుడు.. రాజకీయాల్లో తలపండిన ప్రణబ్ ముఖర్జీ రాసిన తాజా పుస్తకం విడుదలైంది. కల్లోల సంవత్సరాలు 1980-1996 పేరిట విడుదలైన ఈ పుస్తకం ద్వారా చాలా విషయాల్ని ప్రణబ్ ప్రస్తావించారు. ఇందిరాగాంధీ.. రాజీవ్ గాంధీ.. పీవీ నరసింహారాలువు ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు.. నాటి పరిస్థితులు.. తనపై జరిగిన ప్రచారాలు.. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించటం లాంటి ఎన్నో అంశాల్ని ప్రస్తావించారు. అయితే.. అవన్నీ కూడా పరిమితులకు లోబడి మాత్రమే అన్న విషయం ప్రణబ్ చేసిన ఒక వ్యాఖ్యతో స్పష్టమవుతుంది. కొన్ని అంశాలు తనతోనే సమాధి అయిపోతాయన్న వ్యాఖ్య ద్వారా.. తన పుస్తకంలో కొన్ని అంశాల్ని మాత్రమే ప్రస్తావించినట్లు తెలుస్తుంది.

తాజా పుస్తకంలో ప్రధానిగా ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాల్ని పొగిడేసిన ప్రణబ్..అదే సమయంలో ప్రధాని హోదాలో రాజీవ్ తీసుకున్న నిర్ణయాల్ని తప్పు పట్టటం గమనార్హం. అమృత్ సర్ స్వర్ణ దేవాలయంలో దాక్కున్న ఉగ్రవాదులను తరిమికొట్టటంలో సైనిక చర్య మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ఇందిర అర్థం చేసుకొన్నారని.. తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా దేశ ప్రయోజనాల కోసం సైనిక చర్యకు ఆమె పచ్చజెండా ఊపినట్లుగా పేర్కొన్నారు.

ఇదే సమయంలో ప్రధాని హోదాలో రాజీవ్ గాంధీ తీసుకున్న మరో కీలక అంశాన్ని తప్పుపట్టారు. రామజన్మభూమి ఆలయ స్థలాన్ని తెరవటం తప్పుడు నిర్ణయంగా తేల్చారు. ఇక.. వివాదాస్పద కట్టడాన్ని ధ్వంసం చేయటం కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే జరిగిందని వ్యాఖ్యానించారు. ఇక.. తాను ప్రధానమంత్రి పదవిని కోరుకున్నట్లుగా జరిగిన ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసిన ప్రణబ్ దా.. వాటిల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

1984 ఇందిర హత్య అనంతరం తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు తాను ప్రయత్నాలు చేస్తున్నట్లు చాలా పుకార్లు వచ్చాయని.. అవి రాజీవ్ మనసులో తన పట్ల అపనమ్మకాన్ని సృష్టించినట్లుగా ప్రణబ్ పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే తనను కేంద్ర మంత్రి వర్గం నుంచి తొలగించినట్లుగా చెప్పుకొన్నారు. అదొక షాక్ అని.. ఆ వ్యవహారం తనను తీవ్ర విస్మయానికి గురి చేసిందని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News