సంఘ్ సాక్షిగా దాదా స్పీచ్ లోగుట్టు ఇదే!

Update: 2018-06-08 04:40 GMT
అనుకున్న రోజు రానే వ‌చ్చింది. దేశంలోని రాజ‌కీయ పార్టీలు మొద‌లు.. రాజ‌కీయ ఆస‌క్తి ఉన్న వారి వ‌ర‌కూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసిన రోజు రానే వ‌చ్చింది. జ‌ర‌గాల్సింది జ‌రిగిపోయింది కూడా. మాజీ రాష్ట్రప‌తి.. కాంగ్రెస్ పార్టీతో.. సెక్యూల‌ర్ కూట‌మితో సుదీర్ఘ‌కాలం ప్ర‌యాణించిన ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ అలియాస్ దాదా సంఘ్ ప‌రివార్ ప్ర‌ధాన కార్యాల‌యంలో గురువారం రాత్రి ప్ర‌సంగించారు. ఆయ‌న ఏం మాట్లాడ‌తారు?  ఎలాంటి సందేశాన్ని సంఘ్ వేదిక మీద నుంచి ఇస్తార‌న్న విష‌యంపై నెల‌కొన్న ఉత్కంఠ తీరింది.

సంచ‌ల‌నాల‌కు పోకుండా స‌మ‌తూకం మిస్ కాకుండా.. వివాదాస్ప‌ద అంశాల జోలికి వెళ్ల‌కుండా.. అలా అని త‌న మార్క్‌ను మిస్ కానివ్వ‌కుండా ఆచితూచి అన్న‌ట్లుగా ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ స్పీచ్ సాగింది. ఆర్ ఎస్ ఎస్ కార్య‌క‌ర్త‌ల మూడో సంవ‌త్స‌ర శిక్ష‌ణ అనంత‌ర కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా హాజ‌రైన ప్ర‌ణ‌బ్‌.. సంఘ్ అగ్ర‌నేత స‌మ‌క్షంలో వారి మౌలిక సిద్ధాంతాల్ని మారిన కాలానికి త‌గిన‌ట్లుగా ప్ర‌స్తావిస్తూ.. అత్యంత వ్యూహాత్మ‌కంగా ప్ర‌సంగించారు.

భార‌త‌దేశం అంటే హిందువులు.. ముస్లింలు.. సిక్కులు.. అన్ని మ‌తాలు.. కులాలు.. భాష‌లు.. ప్రాంతాల స‌మాహార‌మ‌ని.. ఇదే జాతీయ‌వాద‌మ‌న్నారు. ఒకే దేశం.. ఒకే ప్రాంతం అన్న భావ‌న మ‌న‌కి వ‌ర్తించ‌ద‌న్న మాట‌ను చెప్పిన ఆయ‌న‌.. జాతీయ‌వాదాన్ని చాలా జాగ్ర‌త్త‌గా నిర్వ‌చించే ప్ర‌య‌త్నం చేశారు. ఆధునిక స‌మాజంలో సంఘ్ సిద్ధాంతాల చెల్లుబాటును ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. వారి మ‌నోభావాలు గాయ‌ప‌డ‌కుండా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. కాంగ్రెస్ వాద‌న‌ల్ని.. సంఘ్ వ్య‌తిరేక వైఖ‌రిని ప్ర‌స్తావించ‌ని ప్ర‌ణ‌బ్‌.. సంఘ్ సిద్దాంతాల్ని భుజాన వేసుకున్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌లేదు. అంతేకాదు.. హిందుత్వ సిద్ధాంతాలు ప్ర‌స్తుత స‌మాజంలో ప‌నికి రావ‌న్న మాట‌ను చెప్ప‌టానికి వెనుకాడ‌లేదు.

అదే స‌మ‌యంలో దేశాన్ని ఏకం చేయ‌టంలో స‌ర్దార్ ప‌టేల్ చూపించిన కృషిని పొగ‌డ‌టం.. వందేమాత‌ర గీతాలాప‌న‌.. సంఘ్ నిర్మాత హెడ్గేవార్ స‌హా వారి ముఖ్య‌నేత‌ల్ని ప్ర‌శంసించ‌టం ద్వారా స‌మ‌తూకం మిస్ కాకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. వ‌సుదైక కుటుంబ భావ‌న నుంచి స‌ర్వే జ‌నా సుఖినోభ‌వంతు అనే భావ‌న‌ను అర్థ‌మ‌య్యేలా చెప్ప‌టంలో స‌క్సెస్ అయ్యారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఇతర మతాలు, అన్ని కులాలు.. ఇలా అందరూ కలిస్తేనే భారత్ అని.. దీని అర్థం ఒక మతం లేదా వర్గంలోని ప్రత్యేక సంస్కృతి అంతరించిపోవాలన్నది కాదు.. అందరికీ, అన్నింటికీ ఒకేరకమైన జాతీయ దృక్పథం ఉండాలన్నదే దీని భావమ‌ని ప్ర‌వ‌చించారు.

మెగస్తనీస్‌.. ఫాహియాన్‌.. హుయాన్‌త్సాంగ్‌.. ఇలా ఎందరో గొప్ప యాత్రికులు మన దేశాన్ని సందర్శించి భార‌త్  గురించి ఎంతో గొప్పగా చరిత్రలో రాయ‌టాన్ని ప్ర‌స్తావించారు. మ‌న పాల‌నా వ్య‌వ‌స్థ‌.. విద్యా వ్య‌వ‌స్థ‌.. మౌలిక సౌక‌ర్యాల క‌ల్ప‌న ఎంత చ‌క్క‌గా ఉందో ప్ర‌పంచానికి చాటి చెప్పార‌ని.. క్రీస్తు పూర్వం నుంచి ఆధునిక శ‌కం వ‌ర‌కూ మ‌న దేశానికి వ‌చ్చిన‌.. దేశాన్ని పాలించిన ప్ర‌తి ఒక్క‌రి విశ్వాసాల్లోని మంచిని మేళ‌వించ‌ట‌మే భార‌తీయ‌త‌గా దాదా అభివ‌ర్ణించారు.

ఒకటే మతం.. ఒకటే భాష.. ఉమ్మడి శత్రువు.. అన్న ఐరోపా సమాజ భావనలతో మన జాతి ఉద్భవించలేదన్న ప్ర‌ణ‌బ్ 130 కోట్ల మంది ప్ర‌జ‌లు.. 122 భాష‌లు.. 1600 యాస‌ల స‌మ్మేళ‌న‌మే భార‌తీయ‌త‌గా చెప్పారు.

మ‌న జెండా.. జాతి.. ఒక‌టేన‌ని.. అది భార‌త‌జాతి అన్న ప్ర‌ణ‌బ్‌.. మ‌న‌కు శ‌త్రువుల్లేర‌న్నారు. భిన్న వాద‌న‌ల్ని.. విభిన్న‌మైన వైఖ‌రుల్ని గౌర‌వించాల‌న్న ఆయ‌న‌.. శాంతియుత స‌హ‌జీవ‌నం.. క‌రుణ‌.. జీవితం ప‌ట్ల గౌర‌వం ఇవే నాగ‌రిక స‌మాజానికి పునాదిగా అభివ‌ర్ణించారు.  ప్రజలు సంతోషంగా ఉంటేనే రాజ్యం, పాలకులు సంతోషంగా ఉండగలరని కౌటిల్యుడు ఏనాడో చెప్పాడని.. దేశ సంతోషం కోసం ప్రార్థించాల‌ని.. అందుకు కృషి చేయాల‌న్నారు.


Tags:    

Similar News