పీకే కోసం పేరు మార్చుకున్న జగన్?

Update: 2017-11-03 04:39 GMT
వైసీపీ అధినేత జగన్ మహా పాదయాత్రకు సిద్ధమైపోతున్నారు. రాష్ర్టంలోని అన్ని ప్రాంతాల ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ జనంతో మమేకం కావడానికి రెడీ అవుతున్నారు. దీంతో ఆయన అభిమానులు - పార్టీ శ్రేణులు కూడా ‘అన్న వస్తున్నాడు’ అంటూ ఊళ్లలో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అయితే.. అభిమానులు - కార్యకర్తలు ఉత్సాహపడుతున్నట్లుగా జగన్ పాదయాత్ర పేరు ఇప్పుడు ‘అన్న వస్తున్నాడు’ కాదు.. ఈ మహా పాదయాత్ర పేరు ‘ప్రజా సంకల్ప యాత్ర’. మరి ముందున్న పేరును ఇప్పుడు ఎందుకు మార్చినట్లు. దానికి కారణం ఉందంటున్నారు వైసీపీ నేతలు. ప్రశాంత్ కిశోర్(పీకే) సూచనతోనే పేరు మార్చినట్లు చెబుతున్నారు.
    
జగన్ పాదయాత్ర మాదిరిగానే పేరులో కూడా భారీతనం ఉండాలని.. బృహత్కార్యంలా ఉండాలని... వైఎస్ పాదయాత్ర మాదిరిగానే జగన్ పాదయాత్ర గురించి కూడా చాలాకాలం చెప్పుకొనేలా... తమ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల మీడియా కూడా జగన్ పాదయాత్రకు మంచి కవరేజి ఇచ్చే పరిస్థితి కలిగేలా పేరులోనూ పెద్ద స్థాయి కనిపించాలని పీకే సూచించడంతో జగన్ అంగీకరించారని.. ఆ మేరకే ప్రజా సంకల్ప యాత్ర అని పేరు మార్చినట్లుగా పార్టీ వర్గాలు అంటున్నాయి.
    
దీంతో పాటు పేరు మార్పు వెనుక మరో కోణం కూడా కనిపిస్తోంది. తొలుత అనుకున్నట్లుగా అన్న వస్తున్నాడు అంటే జగన్ యాంగిల్ లో ఉంటుంది.. అదే ప్రజా సంకల్పయాత్ర అంటే ప్రజాకోణం అందులో ఉంటుంది. జగన్ ప్రయోజనాల కోసం చేస్తున్న యాత్రలా కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం చేసే యాత్రగా ప్రజలకు అర్థమవ్వాలన్న ఉద్దేశంతో ఈ పేరు మార్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి కారణం ఏదైనా ప్రజా సంకల్ప యాత్ర జగన్ వ్యతిరేకులు.. పాలక పక్షంలోనూ అలజడి రేపుతోంది. వైఎస్ పాదయాత్ర మాదిరిగానే ఇది కూడా ప్రభంజనం సృష్టిస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.
Tags:    

Similar News