ఆ పార్టీలో చేరిన జ‌గ‌న్ స‌ల‌హాదారు

Update: 2018-09-16 08:34 GMT
దేశ రాజ‌కీయాల్లో కొద్దికాలంగా చ‌ర్చ‌నీయాశంగా ఉన్న వార్త నిజ‌మైంది. అంద‌రూ ఊహించిన‌ట్లుగానే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయ అరంగ్రేటం చేశారు. కొన్నేళ్ల నుంచి పలు రాజ‌కీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఆయన ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారారు. పాట్నాలో డీయూ అధినేత - బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ సమక్షంలో ఇవాళ‌ జేడీయూలో చేరారు. ఆయనకు కండువా కప్పి నితీష్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్‌ బీ లీడర్‌ షిప్ సమ్మిట్‌ లో భాగంగా తొలిసారి ప్రజలతో ముచ్చటించిన ఆయన 2019 ఎన్నికల ప్రచారంలో నేను భాగస్వామ్యం కాదల్చుకోలేద‌ని పేర్కొన్నారు. మళ్లీ క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్టు ఇటీవ‌ల వెల్లడించారు. తాజాగా ఆ అంచ‌నా నిజ‌మ‌యింది.

ప్రశాంత్ కిశోర్‌ స్వస్థలం బిహార్‌ లోని సాసారం. బీహార్‌ కు చెందిన ప్రశాంత్ కిశోర్ గతంలో ఐక్యరాజ్యసమితి(ఐరాస‌)లో పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌ గా పనిచేశారు. అనంతరం ఎన్నికల వ్యూహకర్తగా మారారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపాక్) వ్యవస్థాపక సభ్యుల్లో ప్రశాంత్ కిశోర్ ఒకరు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేందుకు 2014 లోక్‌ సభ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ కీలక పాత్ర పోషించారు. 2015 బీహార్ ఎన్నికల్లో బీహార్‌లో మహాకూటమిని అధికారంలోకి తీసుకురావడంలో విజ‌య‌వంతం అయ్యారు. 2017 పంజాబ్ ఎన్నికల్లోనూ కెప్టెన్ అమరీందర్ సింగ్‌ కు సలహాదారుగా ఉండి.. కాంగ్రెస్ విజయానికి కారణమయ్యారు. ఐతే ఉత్తరప్రదేశ్ - ఉత్తరాఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ఘోరంగా విఫలమయ్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో వైసీపీకి సైతం సలహాలు - సూచనలు ఇచ్చారు.

కాగా,  2019 ఎన్నికల్లో తమ పార్టీల తరఫున పనిచేయాలని బీజేపీ - కాంగ్రెస్ నుంచి ప్రశాంత్ కిశోర్‌ కి ఆఫర్‌  వచ్చినా.. ఆయన మాత్రం వాటిని తిరస్కరించి తానే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ - కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల్లో చేరితే పెద్దగా ప్రాధాన్యత దక్కదని.. ప్రాంతీయ పార్టీలతోనే రాజకీయంగా ఎదిగేందుకు ఎక్కువగా అవకాశాలుంటాయని ఓ అంచనాకు వచ్చిన ఆయన.. జేడీయూను ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే బీహార్‌ లోని అతిపెద్ద ప్రాంతీయ పార్టీ జేడీయూలో చేరుతున్నారు.
Tags:    

Similar News