తెలుగు పాలిటిక్స్ లో మ‌రో పీకే

Update: 2017-04-25 09:59 GMT
పీకే అన్న వెంట‌నే గుర్తుకు వ‌చ్చేది ప‌వర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణే. ఇక‌పై.. అలా అనుకుంటే త‌ప్పులో కాలేయ‌టం ఖాయం. ఎందుకంటే.. రానున్న రోజుల్లో పీకే మాట మ‌రింత త‌ర‌చూ వినిపించే అవ‌కాశం ఉంది. గ‌తంలో మాదిరి పీకే అంటే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ అనుకోవ‌టానికి లేదు. ఇప్పుడా స్థానంలో ప్ర‌శాంత్ కిషోర్ అన్న పేరును గుర్తుంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

ఇంత‌కీ కొత్త పీకే ఎవ‌రో గుర్తుకు వ‌చ్చిందా? 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీ.. అమిత్ షా అండ్ కోకు రాజ‌కీయ వ్యూహాల్ని సెట్ చేయ‌ట‌మే కాదు.. భారీ మెజార్టీతో విజ‌య‌దుందుబి మోగించ‌టంలో కీ రోల్ ప్లే చేశారు. అనంత‌రం.. బీహార్ రాష్ట్రానికి జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నితీశ్ కుమార్ పార్టీకి రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. మోడీ అండ్ కోకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వ‌టం తెలిసిందే. త‌ర్వాతి కాలంలో కాంగ్రెస్ పార్టీకి వ్యూహ‌క‌ర్తగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కోసం ప‌ని చేశారు.

అయితే..గ‌తంలో మాదిరి ప్ర‌శాంత్ కిషోర్ త‌న మేజిక్‌ ను యూపీలో ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయారు. మోడీ.. అమిత్ షా వ్యూహ‌ర‌చ‌న ముందు ప్ర‌శాంత్ కిషోర్ తేలిపోయారు.ఆ మాట‌కు వ‌స్తే..యూపీలో కాంగ్రెస్ బ‌లం అంతంత మాత్ర‌మే. ఈ నేప‌థ్యంలో.. ఆయ‌న ఐడియాల‌జీ అంత‌గా వ‌ర్క్ వుట్ కాలేద‌ని చెప్పాలి. ఇదిలా ఉండ‌గా.. తాజాగా ఆయ‌న ఏపీ రాజ‌కీయాల మీద దృష్టి పెట్ట‌టం తెలిసిందే. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహ‌క‌ర్త‌గా ఆయ‌న వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. 2019 కానీ.. అంత‌కుముందే కానీ ఎన్నిక‌లు జ‌రిగిన ప‌క్షంలో.. జ‌గ‌న్‌ ను అధికార‌పీఠంలో కూర్చోబెట్టేందుకు అవ‌స‌ర‌మైన రాజ‌కీయ వ్యూహాల్ని ఆయ‌న స‌మ‌కూర్చే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన డీల్ ఇప్ప‌టికే జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. సో.. ఇక‌పై తెలుగు రాజ‌కీయాల్లో పీకే మాట వినిపించినంత‌నే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ అని ఫిక్స్ అయితే త‌ప్పులో కాలేయ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News