నితీశ్ ఎపిసోడ్ పై పీకే కామెంట్.. అంత సీన్ లేదట!

Update: 2022-08-11 04:11 GMT
దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన బిహార్ రాజకీయ పరిణామాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తాజాగా రియాక్టు అయ్యారు. బిహార్ లో బీజేపీకి షాకిస్తూ.. కొత్త మిత్రులతో చేరి బిహార్ లో మరోసారి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ వైఖరిపై పెద్ద ఎత్తున విశ్లేషణలు వస్తున్న సంగతి తెలిసిందే. వీటిల్లో చాలా వరకు మోడీకి దెబ్బ పడే వీలుందన్నట్లుగా వాదనలు వినిపించిన వారే ఎక్కువ. బిహార్ ఎపిసోడ్ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ అన్న వాదనలకు భిన్నంగా పీకే వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.

బీజేపీ మిత్రత్వాన్ని నీతీశ్ తెంచుకోవటానికి కారణాలపై ఆయన స్పందిస్తూ.. 'కంఫర్టు (సౌకర్యం) లేకపోవటం వల్లే బయటకు వచ్చి ప్రత్యర్థి కూటమిలో చేరిపోయారు' అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. బిహార్ రాజకీయ పరిణామాలు ఏవీ జాతీయ స్థాయిలో పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని స్పష్టం చేయటం గమనార్హం.

ఈ సందర్భంగా నీతీశ్ నాయకత్వంపై ఆయన కొన్ని విమర్శలు చేశారు. 2017 నుంచి 2022 వరకు బీజేపీతో ఉన్నారని.. ఆ సందర్బంగా ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉన్నది లేదన్నారు. అందుకు చాలానే కారణాలు ఉన్నాయని చెప్పారు.

ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి 2012-13 నుంచి నీతీశ్ ప్రయోగాలు చేస్తున్నారని.. ఇది ఆరోసారి అని అభివర్ణించారు. ఈ ఆరుసార్లు కూడా నీతీశ్ మాత్రమే ముఖ్యమంత్రి అని.. అయినప్పటికీ బిహార్ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని వ్యాఖ్యానించటం గమనార్హం. కనీసం కొత్త ప్రభుత్వంలో అయినా మార్పు వస్తుందని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

అవినీతితో పాటు.. వివిధ అంశాల్లో భిన్నాభిప్రాయాలున్న ఆర్జేడీ.. జేడీయూలు ఎలాంటి పాలన చేస్తాయో చూడాలన్న పీకే మాటలు ఆసక్తికరంగా మారాయి. పీకే మాటల్ని జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లోచక్రం తిప్పే మిషన్ ను చేపట్టిన పీకే.. బిహార్ పరిణామాన్ని గొప్పగా అభివర్ణిస్తే.. దానికి డ్యామేజ్ అయ్యేది కేసీఆర్ భవిష్యత్తు కార్యాచరణే. ఈ కారణంతోనే కావొచ్చు.. బిహార్ లో చోటు చేసుకున్న దాని ప్రభావం రాష్ట్రంలోనే ఉంటుంది తప్పించి జాతీయ రాజకీయాల్లో ఉండదన్న మాట పీకే నోటి నుంచి వచ్చి ఉంటుంది. మోడీ వ్యతిరేకుల నోటి నుంచి వచ్చిన విశ్లేషణకు భిన్నంగా పీకే వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News