పీకే బాణం : జగన్ని లొంగదీసే ఎత్తుగడ...?

Update: 2022-06-15 12:30 GMT
జగన్ 2019 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు అంటే దానికి ప్రశాంత్ కిశోర్ అనబడే వ్యూహకర్త కారణంగా చెప్పుకోవాలి. ఆయన ఏదీ కాదనకుండా హామీలు ఇచ్చేయమన్నారు. అలాగే కులాలలో చీలికలు, సామాజిక సమీకరణలు, సోషల్ ఇంజనీరింగ్ వంటివి ఈ తరహా వ్యూహంలో కనిపిస్తాయి. ఇవన్నీ ఇలా ఉంటే 2019 ఎన్నికల వేళ  ఫలితాలు రాకుండానే జగన్ని సీఎం అంటూ ప్రశాంత్ కిశోర్  తన టీమ్ చేత జేజేలు కొట్టించారు.

ఇదిలా ఉంటే పీకే ఇపుడు వైసీపీకి కాకపోయినా ఆయన టీమ్ లోని రుషి ఇపుడు ఈ వ్యవహరాలు చూస్తున్నారు. ఐ ప్యాక్ సంస్థతో పీకేకు ఈ రోజుకీ సంబంధాలు ఉన్నాయి. అందువల్ల పీకే ఏపీ రాజకీయాల మీద తన క్రీనీడను ప్రసరిస్తూనే ఉన్నారని చెప్పుకోవాలి.

జగన్ సైతం ఆయనతో దోస్తీ కంటిన్యూ చేస్తున్నారు అన్న ప్రచారం ఉంది. ఇదే పీకే ఇపుడు తెలంగాణా సీఎం కేసీయార్ కి రాజకీయ సలహదారుగా మారిపోయారు. అక్కడ భారత రాష్ట్ర సమితి పేరిట ఒక జాతీయ పార్టీకే అంకురార్పణ చేయిస్తున్నారు. ఈ మహా యాగం అలా సాగుతూండగానే దేశంలో కొత్త రాష్ట్రపతి ఎవరు అన్న దాని మీద కూడా పీకే చూపు సారించారు. దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి.

అందునా ఎన్డీయేకు పెద్దగా మెజారిటీ లేని చోట ఏదో ఒక మ్యాజిక్ చేసైనా విపక్షాల తరఫున రాష్ట్రపతిని గెలిపించాలన్న పట్టుదల పీకేలో ఉంది అంటున్నారు. దీనికి నాందిగా మమతా బెనర్జీ నాయకత్వాన విపక్ష నాయకులు, సీఎంలు అంతా సమావేశం అయి విపక్షం తరఫున అభ్యర్ధిని బరిలోకి దించే ప్లాన్ లో ఉన్నారు.

ఇక మమతా బెనర్జీ నేరుగా జగన్ తో మాట్లాడలేదు తమ మీటింగునకు రమ్మని ఆహ్వానం కూడా ఇవ్వలేదు. ఇదే విషయాన్ని  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరో చూసిన మీదటనే జగన్ కీలక నిర్ణయం తీసుకుని పార్టీ విధానం ప్రకటిస్తారు అని ఆయన చెప్పారు.

ఇక జగన్ని మంచి చేసుకునే క్రమంలో బీజేపీ ఇప్పటికే ఒక అడుగు ముందుకేసి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తోంది. అయితే జగన్ ని తమ వైపు లాక్కోవడానికి విపక్షం కూడా ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగా ప్రశాంత్ కిశోర్ బాణాన్ని ఆయన మీద ప్రయోగించాలని చూస్తున్నారుట. మమతా బెనర్జీ ఈ బాధ్యతలను పీకేకు అప్పగించారని అంటున్నారు. జగన్ని ఎలాగైనా విపక్ష కూటమికి సపోర్ట్ చేసేలా చూడాలని ఆమె కోరుతున్నారుట.

ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష శిబిరానికి జగన్ మద్దతు ఉండేలా చూసేందుకు కేసీయార్ కూడా రంగంలోకి దిగబోతున్నారు అని తెలుస్తోంది. సరైన సమయం చూసుకుని ఆయన కూడా జగన్ తో ఫోన్ లో అయినా లేక నేరుగా అయినా ముచ్చట్లు పెడతారు అని అంటున్నారు. జగన్ని కనుక తమ వైపు తిప్పుకుంటే మోడీ పెట్టిన అభ్యర్ధి ఓటమి పాలు కావడం తధ్యమని కేసీయార్ భావిస్తున్నారుట. దాంతో లాస్ట్ పంచ్ తనదన్నట్లుగా చివరలో ఆయన ఫీల్డ్ లోకి దిగి జగన్ మార్చే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి జగన్ మీద ఎన్నో బాణాలు గురి పెడుతున్నారు. ఇంతకీ ఆయన లొంగుతారా. చూడాలి.
Tags:    

Similar News