దీదీతో పీకే: మూడో ఫ్రంట్ కోసమేనా?

Update: 2021-07-11 00:30 GMT
కొద్దిరోజులుగా దేశంలోని బలమైన రాజకీయ నేతలను కలుస్తూ మూడో ఫ్రంట్ ను పట్టాలెక్కించడానికి తపనపడుతున్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో సుధీర్ఘ మంతనాలు జరిపారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యూహాలతో బీజేపీని చిత్తు చేసి మమతను మూడోసారి సీఎంను చేసిన పీకే.. తర్వాత చాలా రోజులకు మమతను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడో ఫ్రంట్ ఏర్పాటు కోసమే ఈ ప్రయత్నాలు అని వార్తలు వస్తున్నాయి.

మమతా బెనర్జీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాల్లో మార్పుల గురించి చర్చించినట్టు ప్రచారం సాగుతోంది.జిల్లాల వారీగా పార్టీని పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై చర్చ సాగింది. ఇదే సమయంలో జాతీయ రాజకీయాలపై మంతనాలు సాగాయని అంటున్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో రాజకీయాలపై మమత, ప్రశాంత్ కిషోర్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. దానికోసమే పీకే సారథ్యంలో ఇప్పటికే బ్లూ ప్రింట్ సిద్ధం చేసినట్లు సమాచారం. వచ్చే నెల నుంచి దీనికి సంబంధించిన కార్యకలాపాలు మొదలవుతాయని అంటున్నారు.

 దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ.. అధికార బీజేపీకి ధీటుగా నిలబడలేకపోతున్న వేళ కొత్తగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని మమతా బెనర్జీ-ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న వేళ జాతీయ రాజకీయాల్లో ఈ కొత్త రూపు ప్రాధాన్యత సంతరించుకుంది.

దేశంలో ప్రస్తుతం అయితే బీజేపీ, లేదంటే కాంగ్రెస్ కేంద్రాలుగా రాజకీయం నడుస్తోంది. వీరికి ప్రత్యామ్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు చాలా రోజుల నుంచి విభిన్న రాజకీయ పార్టీల నేతలు ఒకవేదిక మీదకు వస్తున్నారు. రాజకీయాల్లోనే అత్యంత సీనియర్ మరాఠా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్  ముందడుగు వేశారు..ఈయనకు తోడుగా బీజేపీ నుంచి టీఎంసీలో చేరిన కేంద్రమాజీ మంత్రి యశ్వంత్ సిన్హా నిలిచారు. వీరిద్దరూ ఇటీవలే ఢిల్లీలో థర్డ్ ఫ్రంట్ పై కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ‘మిషన్ 2024’ పేరుతో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కోవాలన్న లక్ష్యంతో దేశంలోని బీజేపీ, కాంగ్రెస్ యేతర పక్షాలను ఏకం చేసే పనిని ఈ సమావేశం ద్వారా మొదలు పెట్టబోతున్నట్టు సమాచారం. దీని వెనుక ఇటీవల శరద్ పవార్ ను కలిసి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్లాన్ ఉన్నట్టు చెబుతున్నారు.

ఢిల్లీలోని పవార్ నివాసంలో ఈ సమావేశం జరిగింది.  రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అప్పట్లో పవార్ ను కలిశాక ఈ భేటి ప్రకటించారు. దీంతో ఈ మాస్టర్ మైండ్ దేశంలో బీజేపీని ఓడించడమే ధ్యేయంగా థర్డ్ ఫ్రంట్ తెరపైకి తెస్తున్నట్టు సమాచారం. బీజేపీపై రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతను సొమ్ము చేసుకుని .. బీజేపీకి వ్యతిరేకమైన పార్టీలన్నింటిని థర్డ్ ఫ్రంట్ లోకి తీసుకోవాలన్న ధ్యేయంతో ఈ భేటి సాగుతోంది.

శరద్ పవార్, యశ్వంత్ సిన్హా ఇప్పటికే 15 పార్టీల నేతలతో ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. పైకి బీజేపీకి వ్యతిరేకంగా సమావేశం కాదన్న ఏదో జరుగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

థర్డ్ ఫ్రంట్ అంటే అందరూ దేశంలో బీజేపీ, కాంగ్రెస్ యేతర ఫ్రంట్ అని అందరూ అనుకున్నారు. కానీ ఆ థర్డ్ ఫ్రంట్ లో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఉంటుందని ఎన్సీపీ అధినేత, థర్డ్ ఫ్రంట్ లో కీలకంగా ఉన్న శరద్ పవార్ బాంబు పేల్చారు. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్మాయం కాదని.. కాంగ్రెస్ తోనే థర్డ్ ఫ్రంట్ అని తేల్చారు. కేవలం బీజేపీకి ప్రత్యామ్మాయంగా ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తే అందులో కాంగ్రెస్ ఉంటుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. బీజేపీని ఎదుర్కొనే ప్రత్యామ్మాయ ఫ్రంట్ కు కాంగ్రెస్ వంటి రాజకీయశక్తి అవసరం అని పవార్ పేర్కొన్నారు.  సో దేశంలో బీజేపీకి ప్రత్యామ్మాయంగా థర్డ్ ఫ్రంట్  ముందుకు సాగుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News