చంద్ర‌బాబుకు మాజీ మంత్రి షాక్‌!

Update: 2019-07-07 10:20 GMT
టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటినుంచి బిజెపి లోకి వెళ్లి పోతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఐదేళ్లపాటు కేబినెట్ లో మంత్రిగా ఉన్న పుల్లారావుకు ఈ ఎన్నికల్లో పెద్ద షాక్ తగిలింది. తన ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన తన శిష్యురాలు విడుదల రజిని స‌వాల్‌  చేసి మరీ పుల్లారావును ఓడించింది. పుల్లారావుది పెద్ద వ్యాపార సామ్రాజ్యం... ఆయన వ్యాపార సామ్రాజ్యం లో పార్టీలతో సంబంధం లేకుండా వైసిపి వాళ్లతో.... బిజెపి వాళ్ళతోను ఆయ‌న‌కు భాగస్వామ్యం ఉందన్నది ఓపెన్ సీక్రెట్. చిలకలూరిపేట రాజకీయాల్లో రెండు దశాబ్దాలకు పైగా వన్ మ్యాన్ షో చేస్తున్న ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

తాజా ఎన్నికల్లో ఓటమి ఆయనను తీవ్రంగా మనస్థాపానికి గురి చేసింది. రాజకీయంగా ఏమాత్రం అనుభవం లేని ఓ ఎన్నారై మహిళ చేతిలో ఓట‌మి ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే వ్యాపార వ్యవహారాలతో పాటు తనపై ఉన్న అనేక‌ ఆరోపణల నేపథ్యంలో బిజెపిలోకి వెళ్లడమే కరెక్ట్ అని ఆయన భావిస్తున్నట్టు కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అగ్రిగోల్డ్ భూముల గోల్‌ మాల్‌ వ్య‌వ‌హారంలో  పుల్లారావు అంద‌రికి ప్ర‌ధాన టార్గెట్‌. ఇక కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఆయ‌న్ను బిజెపిలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. ప్రస్తుతానికి ఆయన మౌనంగా ఉన్న భవిష్యత్తులో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే పార్టీ అధినేత చంద్ర‌బాబు తాజాగా ప్ర‌కాశం జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న చిల‌క‌లూరిపేట‌కు కూడా వ‌చ్చారు. స్వ‌యంగా పార్టీ అధినేత వ‌చ్చినా... నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న కేబినెట్‌ లో మంత్రిగా ఉన్న పుల్లారావు ఈ కార్య‌క్ర‌మానికి డుమ్మాకొట్టారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా చంద్ర‌బాబు పేట‌కు వ‌స్తే పుల్లారావు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అలాంటి రెండు నెల‌ల‌కే చంద్ర‌బాబు త‌న నియోజ‌క‌వ‌ర్గానికి వ‌స్తే పుల్లారావు లైట్ తీస్కోవ‌డంతో ఆయ‌న పార్టీ మారిపోవ‌చ్చ‌న్న చ‌ర్చ‌లు టీడీపీ వాళ్ల‌లోనే వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం చిల‌క‌లూరిపేట‌లో పుల్లారావు పార్టీ మార్పు పెద్ద హాట్ న్యూస్  గా మారింది. ఈ వార్త‌ల‌పై జిల్లా టీడీపీ నేత‌లు క్లారిటీ ఇస్తున్నారు. అందుబాటులో లేని కారణంగానే చంద్రబాబు కార్యక్రమానికి ప్రత్తిపాటి హాజరు కాలేకపోయారని వారు చెపుతున్నారు. ఎంత బిజీగా ఉన్నా ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన నెల రోజుల‌కే చంద్ర‌బాబు స్వ‌యంగా త‌న నియోజ‌క‌వ‌ర్గానికి వ‌స్తే పుల్లారావు రాక‌పోవ‌డం చాలా అనుమానాల‌కు తావిస్తోంది.


Tags:    

Similar News