నిన్నటి వరకు జగన్‌ పై ఎగిరిన ఆ నేత ఇప్పుడు ఎక్కడ - ఎందుకు?

Update: 2020-08-10 14:30 GMT
తెలుగుదేశం పార్టీలో ఉంటూ నిన్నటి వరకు ఓ వెలుగు వెలిగిన బడా నేతలు కొందరు ఇప్పుడు యాక్టివ్‌గా కనిపించడం లేదు. ఇలాంటి వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వారు పత్తిపాటి పుల్లారావు. గత టీడీపీ ప్రభుత్వంలో రాజధాని అమరావతి ప్రాంతం నుండి కీలక నేత. చంద్రబాబు కేబినెట్ లో మంత్రి. సీఆర్డీఏలోను ఆయనది కీలకపాత్ర. 2019 ఎన్నికలకు ముందు సందర్భం వచ్చిన ప్రతిసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. జగన్ పేరు చెబితే అంతెత్తున లేచేవారు. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడం లేదు.

పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ఎప్పుడో అడపాదడపా ప్రెస్ మీట్ తప్పితే క్రియాశీలకంగాలేరు. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారనే చర్చ జోరుగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ పాలనలో జరిగిన అవినీతిని తవ్వుతామని, ఇందుకు కారకులైన వారిని జైలుకు పంపిస్తామని వైసీపీ నేతలు పదేపదే చెప్పారు. అంతేకాదు, అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి నేతలను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించారు.

ఆ భయంతోనే పత్తిపాటి మౌనంగా ఉన్నారా? అనే చర్చ సాగుతోంది. ఇలా మౌనంగా ఉండటం ద్వారా తన వరకు ఆ పరిస్థితి రాకుండా చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారేమో అంటున్నారు. గతంలో పుల్లారావు తనయుడు ఆర్థిక దుశ్చర్యలకు పాల్పడిన ఆరోపణలు ఉన్నాయి. కొన్ని కేసులు నమోదయ్యాయి. తనతో పాటు తన తనయుడి గురించి కూడా ఆందోళన చెంది మౌనం వహిస్తుండవచ్చునని అంటున్నారు.
Tags:    

Similar News