లోకేష్ కు ప్రేమతో.. త్యాగశీలి మీ ప్రత్తిపాటి..

Update: 2018-07-14 06:19 GMT
భయం.. ఇప్పుడు టీడీపీ నేతలకు అది టన్నుల్లో ఉంటోంది. వారి మాటల్లో అది ప్రస్పుటంగా కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికలు అంటేనే టీడీపీ నేతలు ఇప్పుడు హడలి చస్తున్నారు.. ఎందుకొచ్చినా ఎన్నికలురా బాబూ.. ఆ ఆరునెలలు అధికారానికి దూరమైపోతామంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. తాజాగా ఏపీ పౌరసరఫరాల శాఖమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముందస్తు ఎన్నికలపై నర్మగర్భంగా వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు.

ప్రత్తిపాటి మాట్లాడుతూ.. ‘ముందస్తు ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా లేదని.. ప్రజలు ఐదేళ్లు పాలించమని అధికారమిస్తే.. తామెందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్తామని ఆయన ఎదురు ప్రశ్నించారు. బీజేపీ ఓటమి భయంతోనే జమిలి ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నిస్తోందంటూ’ ధ్వజమెత్తారు..

ఇక ప్రతిపాటికి స్వామి భక్తి మరీ ఎక్కువైపోయింది. అధినేత కుమారుడిపై వల్లమాలిన ప్రేమను కురిపిస్తున్నాడు. తాజాగా చిలకూరిలూరిపేటలో మాట్లాడిన ప్రత్తిపాటి పుల్లారావు.. ‘మంత్రి నారా లోకేష్ అడగాలే కానీ.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట సీటు ఇచ్చేస్తానని’ అన్నారు. వచ్చే ఎన్నికల్లో లోకేష్ ఎక్కడి నుంచి పోటీచేసినా సీటు ఇవ్వడానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని టీడీపీ అభ్యర్థులంతా సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. ఆయనకు సీటు సమర్పించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.  

ప్రతిపాటి వ్యాఖ్యలు చూశాక.. ‘ముందస్తు ఎన్నికలు సమీపిస్తుండడంతో టీడీపీ నేతలు ఇప్పుడు తమ సీటును కాపాడుకోవడానికి భయపడుతున్నారని... ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరని..   గెలవమనే భయంతోనే ఇలా త్యాగాలకు సిద్ధపడుతున్నారని’ వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

ప్రస్తుత రాజకీయ సమీకరణాలు చూస్తే తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ సై అంటున్నారు. ఆయన అద్భుతమైన పథకాలతో ఇప్పటికే పాపులర్ అయ్యారు. పథకాలే తనను అధికారమెక్కిస్తాయని నమ్మకంతో ఉన్నారు. అదే సమయంలో ఏపీలో టీడీపీ పాలనపై ఫుల్ గా వ్యతిరేకత వ్యక్తమవుతోందని వార్తలు బయటకు వస్తున్నాయి. జగన్ పాదయాత్ర ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందని.. వైసీపీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారనే అంచనాలు బలపడుతున్నాయి. ఈ వాస్తవం తెలుసు కనుకే ప్రత్తిపాటి ఇప్పుడు ముందస్తు ఎన్నికలు వద్దంటూ ప్రకటన చేశారని వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు..

టీడీపీ ఓడిపోతుందని ఇప్పుడు ఏ నాయకుడు ఒప్పుకోవడం లేదు.. బీజేపీ ఓటమి భయంతోనే ఎన్నికలకు వెళుతోందటున్నారు. ఓడిపోయే వారు ఎవరూ యుద్ధంలో చావడానికి ముందడుగు వేయరు.. బీజేపీ అలా చేస్తుందంటే వారిపై వారికి నమ్మకం ఉంది.  టీడీపీలో అదే లోపించింది. ఈ చిన్న లాజిక్ తెలియకుండా సదురు నేతలు నెపాన్ని బీజేపీపై వేయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Tags:    

Similar News