బీజేపీతో టీడీపీ తెగ‌తెంపుల డేట్ ఫిక్స్‌

Update: 2016-08-10 09:02 GMT
ఏపీ స్పెష‌ల్ స్టేట‌స్ విష‌యంలో మిత్ర‌పక్షాలైన టీడీపీ-బీజేపీల మ‌ధ్య గ్యాప్ మ‌రింత పెరుగుతోంది. ఏకంగా ఈ బంధం పెటాకులు అయ్యే తేదీని కూడా పార్టీనేత‌లు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. అది కూడా అల్లాటప్పా నాయ‌కులు కాకుండా రాష్ట్రంలో కీల‌క మంత్రిగా ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు స‌ద‌రు తేదీని చెప్పేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ప్రభుత్వ గురుకుల పాఠశాలను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడిన పత్తిపాటి పుల్లారావు హోదా కోసం టీడీపీ ఎంపీలు పార్లమెంటులో పట్టు పట్టి పోరాడుతున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను కలిసి చర్చించారని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ ప్రతిపక్షాలు ఆందోళన చేయ‌డం అర్ధరహితమని కొట్టిపారేశారు. త‌మ ప్ర‌య‌త్నాలు ఫ‌లించి రాష్ట్రానికి 13వ తేదీ నాటికి ప్రత్యేక హోదాతో పాటూ ప్యాకేజీ సాధిస్తామని ధీమా వ్య‌క్తం చేశారు. లేకుంటే కేంద్రంతో తెగతెంపులు చేసుకోవడానికైనా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని పుల్లా రావు ప్ర‌క‌టించారు.

విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని అప్పటి కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేర్చకపోవడమే ఇన్ని సమస్యలకు కారణమని పుల్లారావు మండిప‌డ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాలకు కట్టుబడాలని డిమాండ్‌ చేశారు. హోదా సాధన పేరుతో వైఎస్‌ జగన్‌ దొగనాటకాలు ఆడుతున్నారని, కేసుల మాఫీ కోసమే ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తున్నారని మంత్రి విమర్శించారు.
Tags:    

Similar News