ప‌న్ను హిందువుల‌కు...లాభం మైనార్టీల‌కు!

Update: 2017-04-04 07:13 GMT
విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌ భాయ్ తొగాడియా ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్మించిన విశ్వ హిందూ పరిషత్ స్వర్ణ జయంతి మందిర్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటైన సభలో తొగాడియా ప్రసంగిస్తూ హిందూ చరిత్ర వేల సంవత్సరాలది, దీనిని ఎవరూ మరువద్దని సూచించారు. హిందుత్వాన్ని పరిరక్షించేందుకే వీహెచ్‌ పీ ఆవిర్భవించిందని తొగాడియా తెలిపారు.

మన దేశంలో మైనార్టీలు వాళ్ల జనాలను పెంచేందుకు కృషి చేస్తుంటే ప్రభుత్వం వాళ్లకు రాయితీలు - సబ్సిడీలు ఇస్తుందని తొగాడియా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశ వ్యాప్తంగా పన్నులు హిందువులు కడుతుంటే... లాభపడేది మాత్రం మైనార్టీలవుతున్నారని తొగాడియా ఆవేశంగా మాట్లాడారు. త‌మ కామెంట్ల‌పై విమ‌ర్శ‌లు చేసేవారు లౌకిక వాదం ముసుగు వేసుకున్న నాయ‌కులు అస‌లు రంగు అర్థం చేసుకోవాల‌ని తొగాడియా సూచించారు. ``మాకు ప‌ది నిమిషాల స‌మ‌యం ఇస్తే మెత్తం హిందువుల‌ను లేకుండా చేస్తాం`` అని మైనార్టీల‌కు ప్ర‌తినిధులుగా చెప్పుకొనే హింసాత్మ‌క వ్యాఖ్య‌లు చేసిన‌పుడు ఎందుకు స్పందించ‌లేద‌ని ప్ర‌శ్నించారు. భరతమాత సేవలో అందరూ కలిసి రావాలని హిందువులకు తొగాడియా పిలుపునిచ్చారు.

ధరలు విపరీతంగా పెరిగిపోతుంటే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని తొగాడియా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అరగంటకో రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడని, లక్షలాది మంది ఆకలితో అలమటిస్తూ, ప్రాణాలు వదులుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఉన్న పేద హిందువుల కోసం హిందూ హెల్త్ కేర్ పేరిట భారత దేశ వ్యాప్తంగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని తొగాడియా తెలిపారు. ఆంధ్రప్ర‌దేశ్‌, తెలంగాణలో 52 వేల మంది విద్యార్థులకు వీహెచ్‌పీ ఉచిత విద్యను అందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. పేద హిందువుల‌ను ఆదుకునేందుకు వీహెచ్‌ పీ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తుంద‌ని వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News