చీఫ్ సెక్రటరీని ప్రవీణ్ ప్రకాశ్ బదిలీ చేస్తే చెల్లుతుందా?

Update: 2019-11-04 14:43 GMT
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ(పొలిటికల్) అయిన ప్రవీణ్ ప్రకాశ్ ఏకంగా ఏపీ చీఫ్ సెక్రటరీని బదిలీ చేస్తూ ఆదేశాలివ్వడం సంచలనంగా మారింది. ఇది ఐఏఎస్ వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారి తీసింది. అసలు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి చీఫ్ సెక్రటరీని బదిలీ చేయడం సాధ్యమా..? ఈ బదిలీ నిలుస్తుందా.. దీన్ని చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం సవాల్ చేయొచ్చా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

తాజా పరిస్థితులపై మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ వంటి సీనియర్లూ స్పందించారు. సీఎంవోలేని ఏ అధికారికీ బదిలీలు చేసే అధికారం ఉండదని.. అందులోనూ సీఎస్‌ను బదిలీ చేసే అధికారం అస్సలు ఉండదని ఆయన చెప్పారు. ఇది ప్రభుత్వం పనిచేయకపోవడం కిందే పరిగణించాలని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం సలహాదారులుగా ఉన్నవారు ఆయనకు సరైన సలహాలు ఇస్తున్నట్లు లేరని ఆయన అన్నారు. ఇలా సీఎస్‌ను అర్ధాంతరంగా బదిలీ చేయడం సరికాదని.. ఆయన తరువాత ఆ పదవిలోకి రావాల్సినవారికి కూడా ఇది నెగటివ్ మెసేజ్ పంపినట్లు అవుతందన్నారు. తాను గతంలో జగన్‌కు ఓ సందర్భంలో ఇలాంటివి వద్దని చెప్పానన్నారాయన.

చంద్రబాబు హయాంలో సీఎస్‌గా పనిచేసి అనంతరం ఆయనతో విభేదించిన ఐవైఆర్ కృష్ణారావు కూడా ఇది సరైన పరిణామం కాదన్నారు. సీఎస్‌ను తొలగించే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది కానీ ఇలా తొలగించడం సరైన పద్ధతి కాదన్నారు. సీఎంవో బాధ్యత లేకుండా అధికారాలు చెలాయిస్తే అది సీఎం మెడకే చుట్టుకుంటుందని ఆయన అన్నారు. హిందూ దేవాలయాల్లో అన్యమతస్తులను తొలగించే విషయంలో పట్టు పట్టడంతోనే సీఎస్‌ను తప్పిస్తే మాత్రం అది చాలా దారుణమంటూ ఆయన మరో కోణాన్ని ఆవిష్కరించారు.
Tags:    

Similar News