కాశ్మీర్‌ లో బాంబులు వేయాలంటున్న మ‌త‌పెద్ద‌

Update: 2017-08-20 16:59 GMT
ఇటీవ‌లి కాలంలో వ‌రుస క‌ల్లోలాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌ గా మారిన క‌శ్మీర్ గురించి విశ్వహిందూ పరషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహ‌క అధ్య‌క్షుడు ప్రవీణ్ భాయ్ తొగాడియా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్‌ లో జ‌రిగిన‌ విశ్వ హిందూ భ‌జరంగ్ దళ్ శక్తి సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తొగాడియా క‌శ్మీర్ ముష్క‌రుల‌కు బాంబుల‌తో స‌మాధానం చెప్పాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి సూచించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కశ్మీర్‌ లో ముష్క‌రుల దూకుడు పెరిగిపోయింద‌ని దేశం కోసం శ్ర‌మిస్తున్న‌ సైన్యంపై రాళ్లు వేసేవారికి బాంబులతో సమాధానం చెప్పాలని తొగాడియా సూచించారు.

అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగే వరకు విశ్రమించమ‌ని ప్ర‌వీణ్‌ భాయ్ తొగాడియా స్ప‌ష్టం చేశారు. గ‌తంలో సోమనాథ్‌ మందిరం నిర్మాణం కోసం ప్రత్యేక చట్టం తెచ్చినట్లే రామమందిరం నిర్మాణం కోసం పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రామమందిరం నిర్మాణం కేసు సుప్రీం కోర్టులో దశాబ్దాలుగా నానుతోందని అయితే ధర్మంపై కోర్టులు తీర్పులు చెప్పలేవని ఆయ‌న వ్యాఖ్యానించారు. పోరాటం రామమందిర నిర్మాణం గురించి కాదు... రామ జన్మభూమి గురించని విశ్లేషించారు. దేశంలోని వందకోట్ల హిందువుల ఆశయం రామ జన్మభూమి అని తొగాడియా తెలిపారు. అయితే తాము న్యాయవ్యవస్థను - రాజ్యాంగాన్ని గౌరవిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. 100కోట్ల హిందువుల మనోభావాలను కోర్టు గుర్తించాలని కోరారు. రెండు నెలల్లో రామమందిర నిర్మాణం ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించారు. గోరక్షణ అమలు చేయాల్సిన చట్టాలు ప్రభుత్వం చేతిలో ఉన్నాయని నిందలు మాత్రం భజరంగ్ దళ్ - గోరక్షకులపై మోపుతున్నార‌ని ప్ర‌వీణ్ బాయ్ తొగాడియా అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. దేశంలో గోహత్య నిషేధ చట్టం అమలులో ఉంది  కానీ గోహత్యలు జరుగుతూనే ఉన్నాయ‌న్నారు. దేశంలో గోహత్యలు చేసేవారే గూండాలని మండిప‌డ్డారు. చట్టబద్ద పాలన చేసే బాధ్యత ప్రభుత్వానిదని...గోహత్యలు జరుగుతున్నాయంటే చట్టబద్ద పాలన లేనట్లేన‌ని విశ్లేషించారు.

దేశంలో మైనార్టీల హక్కుల గురించి మాట్లాడేవారు... కశ్మీర్ హిందువుల హక్కుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్ర‌వీణ్‌ భాయ్ తొగాడియా సూటిగా ప్ర‌శ్నించారు. హిందువులంతా ఐక్యంగా ఉంటే...ఎవరూ దూషించలేరని తెలిపారు. హిందువులను దూషించడం మాని చట్టాన్ని అమలు చేయడంపై మాట్లాడాలని తొగాడియా కోరారు. దేశంలో 19కోట్ల మంది హిందువులు ఆకలితో అలమటిస్తున్నారని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దేశంలో పదికోట్లమంది హిందూ నిరుద్యోగ యువకులు ఉన్నారని ముస్లింల‌లో నిరుద్యోగం రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నవారు... హిందువులను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిప‌డ్డారు. హిందూ నిరుద్యోగ యువకుల అభివృద్ధి కోసం హిందూ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యవంతులైన యువకులను తయారు చేసేందుకు దేశంలో నాణ్యమైన విద్య కావాలని సూచించారు. హిందువులు మృత్యువుకు భయపడడని - హిందువులకు మరణం లేదని పేర్కొన్నారు. మరణం హిందువులకు పునర్జన్మకు ద్వారం తెరుస్తుందని వివ‌రించారు. ప్రపంచంలో ఉగ్రవాదులను - జిహాదీలను అంతం చేయడమే హిందువుల లక్ష్యమ‌ని ప్ర‌క‌టించారు. జిహాదీ ముఖ్త్‌ భారత్ నిర్మించడమే భ‌జరంగదళ్ లక్ష్యమ‌ని స్ప‌ష్టం చేశారు.

వీహెచ్‌ పీ అంతర్జాతీయ అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి మాట్లాడుతూ మైనార్టీ రిజర్వేషన్లు - రాహు కేతువులు హైదరాబాద్ లోనే ప్రారంభం అవుతున్నాయని ఇక్కడ అడ్డుకుంటే దేశమంతా అడ్డుకోవచ్చున‌ని తెలిపారు. శివరాత్రికి సినిమా థియేటర్లన్నీ భక్తి సినిమాలే ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. సింగపూర్ - మలేషియాల్లో హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు కాబట్టే పాలకులు ఉగ్రవాదాన్ని అణచివేస్తున్నారని తెలిపారు. అఖండ భారత్ లక్ష్యం సాధించేవరకు విశ్రమించబోమ‌ని ప్ర‌క‌టించారు. హిందువుల ధర్మ పరిరక్షణ - గోసంరక్షణ లో ఇబ్బందులు ఎదురవుతాయని అయినా పట్టువదలకుండా ధర్మం కోసం పనిచేయాలని కోరారు.
Tags:    

Similar News