కేంద్రంపై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు

Update: 2018-01-16 11:11 GMT
వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా కేంద్రప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వం తనను వేధిస్తోందని ప్రవీణ్‌తొగాడియా ఆరోపించారు. పాత కేసుకు సంబంధించి రాజస్థాన్ పోలీసులు ప్రవీణ్ తొగాడియాను (ఐపీసీ సెక్షన్ 188 కింద) అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లగా..ఆయన కనిపించలేదు.ప్రవీణ్ తొగాడియా షుగర్ లెవల్స్ తగ్గడంతో సోమవారం ఉదయం పల్ది ఏరియాలోని చంద్రమణి ఆస్పత్రిలో చేరారు.  తాజాగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు.  కేంద్రప్రభుత్వం తనను వేధిస్తోందని ప్రవీణ్‌ తొగాడియా ఆరోపించారు.

మంగ‌ళ‌వారం ఉదయం ఆయనను అరెస్టు చేయడానికి రాజస్థాన్ పోలీసులు వీహెచ్‌పీ కార్యాలయానికి వెళ్లారు. అయితే వారు అక్కడికి చేరుకునేలోగానే ఆయన అక్కడ నుంచి తప్పించుకున్నారు. అయితే అప్పటి నుంచీ ప్రవీణ్ తొగాడియా ఆచూకీ కనిపించకుండా పోయింది. ఆయన సన్నిహితులకు కూడా ఆయన ఎక్కడకు వెళ్లారన్నది తెలియలేదు. దీంతో రాజస్థాన్ పోలీసులు ఆయన అరెస్టు చేశారనీ, వెంటనే ఆయన ఆచూకీ తెలపాలనీ వీహెచ్ పీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనక దిగారు. తాము తొగాడియాను అరెస్టు చేయలేదని రాజస్థాన్ పోలీసులు తెలిపినప్పటికీ వారు నమ్మలేదు. ఈ లోగా దాదాపు 12 గంటల అనంతరం తొగాడియా ఓ పార్కులో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సుగర్ లెవెల్స్ పడిపోవడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు.

డిశ్చార్జీ అయిన అనంత‌రం తొగాడియా మీడియాతో మాట్లాడుతూ `కేంద్రం నా గొంతు నొక్కాలని చూస్తోంది. గుజరాత్ - రాజస్థాన్ పోలీసులు నన్ను వెంటాడుతున్నారు. నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు. రాజస్థాన్ పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. నన్ను ఎన్‌కౌంటర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారమందింది` అని ఆరోపించారు. మీపై ఎవరు దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రశ్నకు స్పందిస్తూ ఎవరినీ నిందించబోనని..సాక్ష్యాధారాలు, పేర్లతో ఈ విషయంపై బహిరంగంగానే మాట్లాడుతానన్నారు.

తన‌ ఆరోగ్యం కుదుటపడగానే గుజరాత్ పోలీసులకు లొంగిపోతానని ప్రవీణ్ తొగాడియా తెలిపారు. తాను రామమందిర్, పశు వధ చట్టం, రైతుల సంక్షేమ పథకాలు వంటి సమస్యలపై మాట్లాడితే..కేంద్రం తన గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తుందని ప్రవీణ్ తొగాడియా విమర్శించారు. కాగా ప్రవీణ్ తొగాడియా పైవిధంగా స్పందించడం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం సృష్టించింది.
Tags:    

Similar News