మోడీ ఓపిక‌ను ప‌రీక్షిస్తున్నారు

Update: 2016-01-20 06:27 GMT
పఠాన్‌ కోట్ ఎయిర్‌ బేస్‌ పై ఉగ్రదాడి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి లిట్మ‌స్ టెస్ట్‌ గా మారింది. మోడీ హ‌ఠాత్‌ గా పాకిస్తాన్‌ లో ప‌ర్య‌టించిన అనంత‌రం ఈ దాడి జ‌ర‌గ‌డం, ఇందుకు పాకిస్తాన్ కేంద్రంగా ప్ర‌ణాళిక సిద్ధ‌మ‌వ‌డం తెలిసిందే. అయితే ఇప్ప‌టికీ స‌ద‌రు ఉగ్ర‌వాదుల విష‌యంలో పాకిస్తాన్ త‌గు చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోవ‌డం మోడీకి ఇబ్బందిక‌రంగా మారుతోంది. ఇప్ప‌టికే వివిధ‌ కార‌ణాల రీత్యా బీజేపీ మిత్ర‌ప‌క్షాలు తీవ్ర గుర్రుగా ఉన్న నేప‌థ్యంలో ఈ ప‌రిణామం మోడీకి ఇబ్బందిక‌రంగా మారింది.

ఇన్నాళ్లు అధికారం పంచుకుంటున్న వారు మోడీని విమ‌ర్శించ‌గా ఇపుడు కొత్త శ‌క్తి తెర‌మీద‌కు వ‌చ్చింది. భార‌తీయ జ‌న‌తాపార్టీని ప్ర‌భావితం చేయ‌గ‌ల కీల‌క శ‌క్తుల్లో ఒక‌టైన విశ్వ‌హిందూ ప‌రిష‌త్ మోడీ తీరుపై మండిప‌డింది. పఠాన్‌ కోట్ ఎయిర్‌ బేస్‌ పై ఉగ్రదాడి నేపథ్యాన్ని తెర‌మీద‌కు తీసుకువ‌స్తూ....మోడీ తీరుపై వీహెచ్‌ పీనేత ప్రవీణ్ తొగాడియా ఘాటుగా స్పందించారు.

ప్రవీణ్ తొగాడియా మీడియాతో మాట్లాడుతూ..పఠాన్‌ కోట్‌ పై దాడి భారత సైన్యంపై జరిగిన దాడి కాదని, అది భారత్‌ పై జరిగిన యుద్ధం వంటిదేన‌ని అన్నారు. ఉగ్రవాదం పోరులో పాక్‌ కు చిత్తశుద్ధి లేదని మాఫియా డాన్‌ దావూద్ ఇబ్ర‌హీం - ఉగ్ర‌వాదులు హఫీజ్ సయీద్ - మసూద్ అజర్‌ ల‌ను ఇప్పటికీ భారత్‌ కు అప్పగించక‌పోవ‌డం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. పాకిస్తాన్‌ లోనే ఉన్న ఈ దుష్ట‌శక్తులపై ఉక్కుపాదం మోపాలని ఆ దేశం భావించడం లేదని చెప్పారు. పాక్‌ కు ఏ భాష అయితే అర్థమవుతుందో అదే భాషలో సమాధానం ఇవ్వాలని తొగాడియా ప‌రోక్షంంగా యుద్ధ సంకేతాలు పంపారు.

పాక్‌ పై మోడీ మొత‌క వైఖ‌రితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్న నేప‌థ్యంలో తాజాగా తొగాడియా యుద్ధం చేయ‌మ‌నే రీతిలో ఇచ్చిన పిలుపు ప‌ఠాన్‌ కోట్ వేడిని మ‌రింత పెంచుతుంద‌ని భావిస్తున్నారు.
Tags:    

Similar News