చప్పట్లు కొట్టి సంబరాలు చేసినోళ్లకు షాకిస్తూ..నిరసన

Update: 2022-01-10 06:57 GMT
‘‘నా చేతికి ఎముక ఉండదని చాలామంది అంటుంటారు’’ అంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులతో జరిగిన భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన మాట. ఎంతోకాలంగా పెండింట్ లో ఉన్న పీఆర్సీ ఇష్యూ లెక్క తేల్చేందుకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతల్ని కూర్చోబెట్టుకున్న సందర్భంగా.. వారి డిమాండ్లను మొత్తంగా తీర్చలేను కానీ.. వారంతా సంతోషపడేలా చేస్తానని మాటిచ్చి పంపారు. కట్ చేస్తే.. మరోసారి ముఖ్యమంత్రి జగన్ ను కలిసే అవకాశం దక్కిన సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలకు.. కాన్ఫరెన్సు హాల్ లోకి పంపే ముందు.. అదేంటి? ఇదేంటి? అని అడగొద్దు. ప్రకటన చేసినంతనే చప్పట్లు కొట్టండన్న మాటను తమదైన శైలిలో చెప్పి పంపినట్లుగాచెబుతారు.

ఈ కారణంతోనే.. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన పీఆర్సీ మీద తమకేమాత్రం సంతోషం లేకున్నా.. ముందుగా అందిన ఆదేశాలకు అనుగుణంగా చప్పట్లు కొట్టినట్లుగా ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత చెప్పినా.. వారు మాత్రం తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారట. దీంతో.. ఉద్యోగ సంఘాల నేతలు తమ ఫోన్లను ఎత్తేందుకు కూడా ఇష్టపడటం లేదంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి ఐఆర్ కంటే తక్కువ శాతం పీఆర్సీని ప్రకటించటాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఐఆర్ అంటే.. మధ్యంతర భ్రతి. దాన్ని తాజాగా ప్రకటించిన పీఆర్సీతో సర్దుబాటు చేస్తారు. అయితే..ఇప్పటికే అందుతున్న ఐఆర్ కంటే తక్కువగా పీఆర్సీ ప్రకటించటంతో.. ఇప్పుడు వచ్చే జీతంతో పోలిస్తే.. కొంత తక్కువ వస్తుందని..ఒకవేళ పెరిగినా.. చాలా చాలా తక్కువ పెరుగుతుందని చెబుతున్నారు. దీంతో.. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ మీద గుర్రుగా ఉన్న వారు.. తాజాగా ఆందోళన బాట పట్టాలన్న ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. ఏదోలా ముఖ్యమంత్రి పీఆర్సీ ప్రకటన సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతల చేత చప్పట్లు కొట్టించి.. అంతా బాగుందన్న భావనను కలిగేలా చేసిన ‘పెద్దలు’.. ఉద్యోగులను మాత్రం కూల్ చేయటంలో విఫలమవుతున్నట్లు తెలుస్తోంది.

పీఆర్సీని ప్రకటించే క్రమంలో తొలుత27 శాతం మధ్యంతర భ్రతి (ఐఆర్)ను జగన్ సర్కారు ప్రకటించింది. ఇది జరిగి రెండేళ్లు అవుతున్నా.. పీఆర్సీ మీద నిర్ణయాన్ని తీసుకోకపోవటంతో.. ఉద్యోగలు పోరుబాట పట్టారు. తొలత 14.29 శాతం ప్రకటించిన ప్రభుత్వ అధికారుల లెక్కకు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. ఇదేమాత్రం సరికాదని తేల్చారు. దీంతో.. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి 23 శాతానికి ఓకే చేయించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు ట్విస్టు చోటు చేసుకుందని చెబుతున్నారు.

ఒక దశలో 45 శాతమని కొందరు.. కాదు 55 శాతమని మరికొందరు ఫిట్ మెంట్ డిమాండ్ ను తెర మీదకు వస్తే.. అందులో సగం కూడా ఓకే అనకపోవటం.. 23 శాతానికి ఓకే చెప్పటం.. తమకు నష్టం వాటిల్లేలా చేస్తుందని చెబుతున్నారు. తమ తరఫున ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఉద్యోగ సంఘాల నేతల తీరుపైన వారు ఫైర్ అవుతున్నారు.

ఇదిలా ఉంటే.. గ్రామ.. వార్డు సచివాలయాల ఉద్యోగులు తమ జీతాల్ని పెంచే విషయంలో వాయిదా వేసిన వైనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ గ్రూపుల నుంచి ఎగ్జిట్ కావటం ద్వారా ఆందోళనకు తెర తీశారు. వీరి నుంచి స్ఫూర్తి పొందిన ఉద్యోగులు తాజాగా పోరుబాట పట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే.. ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవంటున్నారు.
Tags:    

Similar News