8 ఆస్పత్రులు..8 గంట‌లు తిరిగినా బ‌త‌క‌లే: ప్రైవేటు ఆస్ప‌త్రుల నిర్ల‌క్ష్యంతో గ‌ర్భిణి మృతి

Update: 2020-06-23 01:30 GMT
ప్ర‌స్తుతం మ‌హ‌మ్మారి వైర‌స్ తీవ్రంగా ప్ర‌బ‌లుతోంది. ఈ వైర‌స్ ల‌క్ష‌ణాలు ఉన్నా లేకున్నా మాత్రం ప్ర‌జ‌లు చిన్న అనారోగ్యం చెందినా భ‌యాందోళ‌న చెందుతున్నారు. ఈ భ‌యంతో వైద్య సేవ‌లు మృగ్యంగా మారాయి. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌న్నీ ప్ర‌స్తుతం వైర‌స్ నివార‌ణ కేంద్రాలుగా మార‌గా... ఉన్న ‌ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం వైద్యం అందించ‌లేమ‌ని చేతులెత్తేస్తున్నాయి. అనారోగ్యంతో వ‌చ్చిన రోగిని ప‌రీక్షించ‌కుండానే వైర‌స్ బాధితులు అని భ‌యాందోళ‌న చెందుతూ తిరిగి పంపుతున్నారు. దీంతో వైద్యం అంద‌క ఇటీవ‌ల చాలామంది మృతి చెందుతున్నారు. మొన్న‌టికి మొన్న హైద‌రాబాద్‌లో ఓ వివాహిత మృతిచెందిన విష‌యం తెలిసిందే. తాజాగా ఢిల్లీలో ఒక నిండు గ‌ర్భిణి ఇదే కార‌ణంగా మృతిచెంద‌డం క‌ల‌వ‌రం రేపుతోంది.

ఢిల్లీకి చెందిన దంప‌తులు బిజేంద్ర‌సింగ్‌, నీలా కుమారి గౌతమ్. నెల‌లు నిండ‌డంతో జూన్ 5 ఉదయం 5 గంటల సమయంలో నీలాకుమారికి నొప్పులు వచ్చాయి. దీంతో భర్త బిజేంద్ర సింగ్ ఓ రిక్షా మాట్లాడుకుని నోయిడాలోని ఈఎస్ఐసీ మోడల్ ఆస్ప‌త్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు వేరే ఆస్పత్రికి వెళ్లాలంటూ చెప్పి పంపించారు. ఆ స‌మ‌యంలో ఊపిరి ఆడ‌క‌పోవ‌డంతో నీల‌కుమారి మాస్క్ తీస్తుండ‌గా అక్కడ ఉన్న వైద్య సిబ్బంది మాస్కు తీసివేస్తే చెంప పగలగొడుతామంటూ వైద్యులు తీవ్రంగా స్పందించారు. దీంతో షాక్‌కు గుర‌య్యాడు. అయినా త‌న భార్య శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతోందని.. ఆక్సిజన్ పెట్టాలని ఎంతో బతిమాలాడు. వారు స‌సేమిరా అన‌డంతో ఇక విధిలేక‌ అక్కడి నుంచి మరో ఆస్పత్రికి వెళ్లాడు. అక్క‌డా అదే ప‌రిస్థితి. ఇలా రెండు, మూడు ఆస్ప‌త్రులు తిరిగాడు. చివ‌ర‌కు శివలిక్ ఆస్పత్రికి వెళ్లగా ఆమెకు ప్రాథ‌మిక చికిత్స అందించారు. కొద్దిసేపు ఆక్సిజన్ కూడా పెట్టారు. అయితే వారు కూడా వైరస్ ఉందేమోనని భయప‌డి కొద్దిసేప‌టికి వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆమె భ‌ర్త బిజేంద్ర సింగ్‌కు చెప్పారు.

ఇక అక్క‌డి నుంచి మ‌రికొన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. ఫోర్తిస్ ఆస్పత్రికి వెళ్లగా ఆమె చనిపోయేలా ఉంది.. ఇక్కడ ఉండ‌వ‌ద్ద‌ని అక్కడి వైద్యులు చెప్పారు. కొద్దిసేపు వెంటిలేటర్‌పై ఆక్సిజన్ అందించాలని బతిమిలాడినా పట్టించుకోలేదు. దీంతో అత‌డు పోలీసులకు ఫోన్ చేసి సహాయం కోరాడు. గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ వైద్యులతో పోలీసులు మాట్లాడారు. ఆ ఆస్ప‌త్రికి వెళ్లాక సేమ్ ప‌రిస్థితి. అక్క‌డి నుంచి 12 కిలో మీట‌ర్ల‌ దూరంలో ఉన్న ఘజియాబాద్‌లోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్లారు. తెల్ల‌వారుజాము నుంచి మధ్యాహ్నం అయ్యింది. దాదాపు 8 గంటల పాటు ఆస్ప‌త్రుల చుట్టూ తిరిగారు. ఆ ఆస్ప‌త్రులోనూ ఇదే స‌మాధానం. చివ‌ర‌కు ఆమె ప‌రిస్థితి విష‌మించింది. చివరకు రాత్రి 8.05 గంట‌ల‌కు మ‌ళ్లీ గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు వెళ్లారు. ఆపాటికే ఆమె మృతి చెందింది.

ఈ విధంగా ఆస్ప‌త్రుల నిర్ల‌క్ష్యంతో ఓ నిండు గ‌ర్భిణి మ‌ర‌ణించింది. ఉదయం 5 నుంచి రాత్రి 8 గంట‌ల‌ వరకు 8 ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఆమెకు వైద్యం అంద‌లేదు. వైర‌స్ భ‌యంతో ఆస్ప‌త్రులు ఈ విధంగా మిగ‌తా వైద్య సేవలు అందించ‌డం లేదు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
Tags:    

Similar News