వైఎస్సార్సీపీ..ఓవర్ కాన్ఫిడెన్స్..అంతే సంగతులు!

Update: 2019-03-27 14:23 GMT
సర్వేల్లో విజయం సాధించడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. ప్రత్యేకించి గత కొన్నాళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఊపు గురించి - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్ల గురించి వివిధ మీడియా వర్గాలు ఆ పార్టీ అభిమానులకు స్వీట్ న్యూస్ నే చెబుతూ ఉన్నాయి. జాతీయ మీడియా వర్గాలు ఈ విషయంలో ముందున్నాయి.

ఇండియాటుడే - టైమ్స్ నౌ - రిపబ్లిక్ టీవీ… వంటి విభిన్న మీడియా వర్గాలు.. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊపు ఉందని అంచనా వేశాయి. తమ తమ సర్వేల్లో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందని తేలిందని సదరు మీడియా వర్గాలు చెప్పుకొచ్చాయి.

ఇక జాతీయ చానళ్లే కాదు.. ప్రాంతీయ మీడియాలో కూడా ఇలాంటి మాటలే వినిపించాయి. తెలుగుదేశం అనుకూల మీడియాను మినహాయిస్తే.. యూట్యూబ్ స్థాయి మీడియా - ఇంకా వివిధ ప్రైవేట్ పార్టీ సర్వేలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నాయి.

ఆ హోరు  ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ప్రత్యేకించి సోషల్ మీడియా.. అందుకు సంబంధించిన రకరకాల విషయాలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్యన ఇందుకు సంబంధించిన వాట్సాప్ మెసేజ్ లు షేర్ అవుతూ ఉన్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల మధ్యన ఇందుకు సంబంధించిన హడావుడి కనిపిస్తూ ఉంది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే.. వీటిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు - కార్యకర్తలు పట్టించుకోవడం లేదు. వారు తమ పని తాము చేసుకొంటూ పోతున్నారు. సర్వేలు - అధ్యయనాలతో సంబంధం లేదన్నట్టుగా.. తెలుగుదేశం పార్టీ అధినేత నుంచి క్షేత్ర స్థాయి అభిమాని వరకూ తమ పని తాము చేసుకొంటూ పోతూ ఉన్నారు.  ఈ  విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రహిస్తున్నారా? అనేదే ఇక్కడ ఆసక్తిదాయకమైన అంశం.

ఇలాంటి సోషల్ మీడియా పోస్టులతో.. షేరింగులతో ఉండే ప్రయోజనం ఏమీ లేదని..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రహించాయా అనేది సందేహమే. క్షేత్ర స్థాయిలో పని చేసుకొంటూ.. ప్రయోజనం ఉంటుంది తప్ప..ఇలాంటి వాటిని నమ్మేసి - ఓవర్ కాన్ఫిడెన్స్ కు లోనైతే అంతే సంగతులు.. ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు గుర్తుంచుకోవాలని.. ప్రత్యర్థులు కూడా ఒక విసురు విసురుతున్నారు!
Tags:    

Similar News