వీర జ‌వాన్ సాహ‌సానికి రాష్ట్రప‌తి కంట‌త‌డి!

Update: 2018-01-26 12:14 GMT
నేడు దేశ‌వ్యాప్తంగా 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబ‌రాన్నంటాయి. రాష్ట్రపతి భవన్‌ లో ఘ‌నంగా జ‌రిగిన ఈ వేడుకల్లో భాగంగా భాగంగా ప్రెసిడెంట్ మెడల్స్‌ ప్రదానోత్సవం జరిగింది. దేశం కోసం వీర మరణం పొందిన అమ‌ర‌వీరుల‌కు శౌర్య అవార్డులు ఇవ్వడం ఆన‌వాయితీ. గ‌త ఏడాది దేశం కోసం అశువులు బాసిన అమ‌ర‌వీరుల‌కు రాష్ట్రపతి కోవింద్....`శౌర్య‌`అవార్డుల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన గ‌రుడ క‌మాండో కార్పొర‌ల్ గా విధులు నిర్వ‌ర్తిస్తూ అమ‌రుడైన‌ జ్యోతి ప్ర‌కాష్ నిరాలా కుటుంబానికి అవార్డు అంద‌జేసిన‌ కోవింద్ భావోద్వేగానికి లోన‌య్యారు. ఆయన సతీమణి సుష్మానంద్‌ - తల్లి మాలతీదేవిల‌కు ఆ అవార్డు అంద‌జేస్తున్నపుడు కోవింద్ ఒక్కసారిగా  కంటతడి పెట్ట‌డంతో అక్క‌డ గంభీర వాతావ‌ర‌ణం ఏర్పడింది. వారు ఆ అవార్డు అందుకున్న తర్వాత కోవింద్ కొద్దిసేపు ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ త‌ర్వాత కర్చీఫ్ తీసి కన్నీళ్లు తుడుచుకున్నారు. ఈ ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.  

గత ఏడాది నవంబరు 18న.. జమ్మూకశ్మీర్‌ లోని బందిపొరా జిల్లాలోని చందేర్‌ గీర్‌ గ్రామంలోని ఓ ఇంట్లో లష్కరే ఉగ్రవాదులు దాక్కున్నారంటూ నిఘా వర్గాల ఇచ్చిన సమాచారం ప్ర‌కారం ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. భారత వైమానిక దళానికి చెందిన గరుడ కమెండో కార్పొరల్‌ జ్యోతి ప్రకాశ్‌ నిరాలా ఆ బృందంలో స‌భ్యుడిగా ఉన్నారు. ముంబై 26/11 దాడుల సూత్రధారి జకీవుర్‌ రెహమాన్‌ లఖ్వీ మేనల్లుడు సహా ఆరుగురు ఉగ్రవాదుల తూటాలకు ఎదురొడ్డి.. ముగ్గురు టెర్రరిస్టులను నిరాలా మట్టుబెట్టారు. ఓవైపు బుల్లెట్ల వ‌ర్షం కురుస్తున్నాలెక్క‌చేయ‌కుండా తుదిశ్వాస విడిచేవ‌ర‌కు వీరోచితంగా పోరాడి అశువులు బాశారు. దీంతో, నిరాలా సాహ‌సానికి గుర్తుగా భార‌త ప్ర‌భుత్వం ‘అశోక చక్ర’ పురస్కారాన్ని ప్రకటించింది! యుద్ధభూమిలో వీరోచిత పోరాటం చేసిన సైనికులకు ఇచ్చే పరమవీర చక్రతో సమానమైన `అశోక చ‌క్ర‌`ను నిరాలాకు ప్ర‌క‌టించ‌డం విశేషం. యుద్ధరంగంలో కాకుండా ఇతర ప్రదేశాల్లో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ఇచ్చే పురస్కారం. మరణానంతరం ‘అశోక చక్ర’ అందుకుంటున్న తొలి వాయుసేన కమాండో నిరాలా కావ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News