స్పెషల్ ట్రైన్ లో సొంతూరికి పయనమైన రాష్ట్రపతి కోవింద్‌ .. 15 ఏళ్ల తర్వాత అలా !

Update: 2021-06-25 12:30 GMT
భారతదేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్ నాథ్‌ కోవింద్‌ రైలు ప్రయాణం చేశారు. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌ లోని ఆయన స్వస్థలమైన కాన్పూర్‌ లోని తన స్వస్థలం పారౌఖ్‌కు శుక్రవారం రైలులో బయలుదేరారు. ఈ పర్యటనలో ఆయన పరిచయస్తులతో పాటు కలిసి చదువుకున్న పాఠశాల మిత్రులను కలువనున్నారు. అయితే, 15 సంవత్సరాల తర్వాత భారత రాష్ట్రపతి రైలులో ప్రయాణించడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందే రాంనాథ్‌ కోవింద్‌ సొంత గ్రామానికి వెళ్లాలనుకున్నా, కరోనా మహమ్మారి కారణంగా సాధ్యం కాలేదని రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.

ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ రైల్వే స్టేషన్‌ లో రాష్ట్రపతి దంపతులు స్పెషల్ ట్రైన్‌ ఎక్కారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌, రైల్వే బోర్డు చైర్మన్‌, సీఈవో సునీత్‌ శర్మ స్వయంగా వచ్చి వారికి వీడ్కోలు చెప్పారు. అయితే రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాంనాథ్‌ కోవింద్‌ తన స్వస్థలానికి వెళ్లడం ఇదే తొలిసారి. అయితే, రాష్ట్రపతి ప్రయాణిస్తున్న రైలు, కాన్పూర్‌ సమీపంలోని జింఝాక్‌, రూరా ప్రాంతాల్లో రెండు సార్లు ఆగనుంది. అక్కడ కోవింద్‌ తన పాఠశాల రోజుల్లో పరిచయమున్న వ్యక్తులతో కాసేపు ముచ్చటిస్తారు. ఇక్కడ నాటి పాత పరిచయస్తులను కలువనున్నారు. గ్రామాన్ని సందర్శించిన తర్వాత తిరిగి ఈ నెల 28న కాన్పూర్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రైలులో లక్నోకు చేరుకుంటారు. పర్యటన అనంతరం తిరిగి 29న ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి రానున్నారు. అంతకుముందు 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మిలిటరీ అకాడమీ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు హాజరు అయ్యేందుకు ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు ప్రత్యేక రైలులో ప్రయాణించారు. ఇక భారత తొలి ప్రథమ పౌరుడు రాజేంద్ర ప్రసాద్‌ కూడా రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఎక్కువ సార్లు రైలు ప్రయాణాలు చేశారట. మళ్లీ ఇప్పుడు రామ్ నాధ్ కోవింద్ రైలు ప్రయాణం చేసారు.
Tags:    

Similar News