రాష్ట్రప‌తికి మ‌రీ ఇంత డేంజ‌ర్ ఏర్పాట్లా బాబు?

Update: 2017-12-28 04:42 GMT
అత్యుత్త‌మ స్థాయిలో ఉన్న వారికి సంబంధించి ఏర్పాట్లు చేయాల్సి వ‌స్తే ఎంత ముందుజాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఎంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ.. అదేమీ లేకుండా చేసిన వైనంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి వ‌చ్చిన రాష్ట్రప‌తి కోవింద్ స‌తీమ‌ణి స‌వితా.. కుమార్తె స్వాతిల‌ను  అనుమ‌తి లేని బోట్ లో విహారానికి ఓకే అన‌టంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

బుధ‌వారం పున్న‌మిఘాట్ నుంచి భ‌వానీ ద్వీపానికి అనుమ‌తి లేని ప్రైవేటు బోటులో తీసుకెళ్లారు. అనుకోనిది ఏదైనా జ‌రిగితే ఏం కావాల‌న్న ప్ర‌శ్న ప‌లువును వ్య‌క్తం చేస్తున్నారు. దారుణ‌మైన విష‌యం ఏమిటంటే.. బోటు ప్ర‌యాణంలో భాగంగా రాష్ట్రప‌తి స‌తీమ‌ణి.. వారి కుమార్తెను ఎండ‌లో కూర్చోబెట్టారు.

తిరుగు ప్ర‌యాణంలో మాత్రం ప‌ర్యాట‌క శాఖ‌కు చెందిన బోటులో తిరిగి తీసుకొచ్చారు. వెళ్లేట‌ప్పుడు కూడా ప‌ర్యాట‌క శాఖ బోటులో తీసుకెళితే బాగుండేద‌న్న మాటను రాష్ట్రప‌తి స‌తీమ‌ణి అన్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ మ‌ధ్య‌నే బోటు ప్ర‌మాదం చోటు చేసుకున్న వేళ‌.. బాబు స‌ర్కారు ఏ మాత్రం గుణాపాఠాల్ని నేర్చుకోవ‌టం లేద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉండ‌గా..  రాష్ట్రప‌తి స‌తీమ‌ణి.. కుమార్తెల‌ను ఇంద్ర‌కీలాద్రిపై కొలువు తీరిన దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం చేయించారు. పూర్ణ కుంభంతో ఆల‌య సిబ్బంది సంప్ర‌దాయానికి త‌గిన‌ట్లుగా స్వాగ‌తం ప‌లికారు. అమ్మ‌వారి ద‌ర్శ‌నం త‌ర్వాత రాజ‌గోపురం నుంచి న‌డుస్తున్న స‌వితా కోవింద్ తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది.

రాజ‌గోపురం లోప‌ల‌కు ప్ర‌వేశించేందుకు ఏర్పాట్లు చేసిన ఐర‌న్ ర్యాంప్ వ‌ద్ద స‌విత అదుపు త‌ప్పి జారిప‌డుతున్న వేళ‌.. ప‌క్క‌నే ఉన్న సిబ్బంది క్ష‌ణాల్లో అప్ర‌మ‌త్త‌మై ప‌ట్టుకున్నారు. క్ష‌ణాల వ్య‌వ‌ధిలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో రాష్ట్రప‌తి శ్రీ‌మ‌తికి ఏమీ కాక‌పోవ‌టంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Tags:    

Similar News