రాష్ట్రపతి ఎన్నికలు జగన్ కు బంఫర్ చాన్సేనా?

Update: 2022-06-13 05:39 GMT
జగన్ కు రాష్ట్రపతి ఎన్నికల రూపంలో బంఫర్ చాన్సు వచ్చిందా అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జూలైతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. ఇదే ఇప్పుడు వైఎస్ జగన్ కు పెద్ద వరంగా మారబోతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తనపై సీబీఐ, ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన కేసుల విచారణను మరింత ఆలస్యం చేయించుకోవడానికి అద్భుత అవకాశాన్ని కల్పించబోతోందని అంటున్నారు.

ఎలాగంటే.. ప్రస్తుతం రాష్ట్రపతిగా తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కావాల్సినంత మద్దతు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేదు. బీజేపీ, దాని కూటమిలోని పార్టీలన్నింటికి కలిపి 49 శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీలన్నింటికి కలిపి 51 శాతం ఓట్లు ఉన్నాయి. టీఆర్ఎస్, డీఎంకే, వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన, జార్ఖండ్ ముక్తి మోర్చా, సమాజ్ వాదీ పార్టీ, జేడీఎస్ (జనతాదళ్ సెక్యులర్), ఆర్జేడీ (రాష్ట్రీయ జనతాదళ్), రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ), నేషనల్ కాన్ఫరెన్స్, శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్సీ), ఎంఐఎం వంటివి ఏవీ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నిలబెట్టే అభ్యర్థికి మద్దతు ఇచ్చే చాన్సు లేదు.

కేవలం ఒడిశాలోని బిజూ జనతాదళ్ (బీజేడీ), బిహార్లోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), తమిళనాడులోని అన్నాడీఎంకే, ఉత్తరప్రదేశ్ లో అప్నాదళ్ (ఎస్) వంటి పార్టీలు, మరికొన్ని చిన్నాచితక పార్టీలు మాత్రమే బీజేపీ నిలబెట్టే అభ్యర్థికి మద్దతిచ్చే చాన్సు ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థిని రాష్ట్ర.పతి ఎన్నికల్లో గెలిపించుకోవాలంటే బీజేపీకి మరికొంత బలం అవసరమవుతుందని అంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ అడగక ముందే సాయం చేయడానికి సిద్ధంగా ఉందని పేర్కొంటున్నారు. తద్వారా బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడంతోపాటు తనపై సీబీఐ, ఈడీ పెట్టిన కేసుల విచారణను ఆలస్యం చేసుకోవచ్చని జగన్ భావిస్తున్నారని అంటున్నారు.

వాస్తవానికి.. గత పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ రాదని.. అప్పుడు తన బలం అవసరమవుతుందని జగన్ పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారని చెబుతున్నారు. తన మద్దతు అవసరమైన పార్టీకి మద్దతు ఇచ్చి కేంద్రంలో చక్రం తిప్పొచ్చని.. తద్వారా తనపై ఉన్న కేసులను కొట్టేయించుకోవచ్చని ఆయన తలపోశారని అంటున్నారు. అయితే.. జగన్ దురదృష్టం కొద్దీ కేంద్రంలో బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ మద్దతు అవసరం లేకుండా పోయింది. దీంతో వైఎస్ జగన్ తీవ్ర నిరాశ చెందారని అప్పట్లో వార్తలు వచ్చాయని గుర్తు చేస్తున్నారు.

అప్పట్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో తన మద్దతు అవసరం లేకపోయినా బీజేపీ పెద్దలతో వైఎస్ జగన్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. వివిధ సందర్భాల్లో అడగకుండానే బీజేపీ నేత మాదిరిగా ప్రధాని మోడీని జగన్ వెనకేసుకొచ్చారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కోవిడ్ టీకాల విషయంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించిన సంగతి తెలిసిందే. వెంటనే ఈ ట్వీట్ కు జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం గమనార్హం. అంతా కోవిడ్ తో విలవిలలాడే సమయంలో ప్రధాని మోడీని ఈ సందర్భంలో విమర్శించడం సరికాదంటూ జగన్.. హేమంత్ సోరెన్ కు సుద్దులు చెప్పారని అంటున్నారు. దీంతో ఒళ్లు మండిన జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ట్విట్టర్ లోనే జగన్ పైన ఘాటుగా విరుచుకుపడిన సంగతిని గుర్తు చేస్తున్నారు. మీపై కేసులు ఉన్నాయి కాబట్టి.. వాటి నుంచి బయటపడటానికి మోడీ జపం చేస్తారని.. తమకు ఆ అవసరం లేదని జార్ఖండ్ ముక్తి మోర్చా ఘాటుగా రిప్లై ఇచ్చిన సంగతి ఇక్కడ గమనార్హమని విశ్లేషకులు అంటున్నారు.

ఇది ఒకటే కాకుండా వివిధ సందర్భాల్లో నరేంద్ర మోడీ తిరుమల పర్యటనకు వచ్చినప్పుడు రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్ జగన్ ప్రధాని మోడీ కాళ్లపై పడబోయిన వీడియో భారీగా వైరల్ అయ్యింది. కేసుల భయంతోనే జగన్ ఇలా చేశారని అంతా చెప్పుకున్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ పై ఉన్నారు. ఈ బెయిల్ రద్దయితే ఆయన జైలుకు పోవడం ఖాయం. అదే జరిగితే ఆయన ముఖ్యమంత్రి పదవి ఊడటం కూడా ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. వివిధ సందర్భాల్లో మోడీ ప్రభుత్వానికి వత్తాసుగా నిలుస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. పార్లమెంటు రెండు సభల్లో వివిధ అంశాలు, బిల్లులపై చర్చ జరిగినప్పుడు మోడీ ప్రభుత్వానికి జగన్ పార్టీ మద్దతు ప్రకటిస్తుండటం ఇందులో భాగమేనని అంటున్నారు.

ఇక వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అయితే బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారని గుర్తు చేస్తున్నారు. వారితో లాబీయింగ్ చక్కగా నిర్వహిస్తున్నారని చెప్పుకుంటున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ రైల్వే జోన్ వంటివాటి కంటే తమపై కేసుల విచారణను జాప్యం చేయడమే లక్ష్యంగా బీజేపీ పెద్దలతో పరిచయాలను కొనసాగిస్తున్నారని పేర్కొంటున్నారు. అస్సలు విజయసాయిరెడ్డిని జగన్ రాజ్యసభకు పంపింది కూడా ఇందుకేనని వివరిస్తున్నారు. జగన్ ఆశించినట్టే విజయసాయిరెడ్డి కూడా దాదాపు అన్ని అంశాల్లో బీజేపీ ప్రభుత్వానికి గట్టి మద్దతునిస్తున్నారని చెబుతున్నారు.

అందుకే తెలంగాణ కంటే ఏపీకి ఎక్కువ నిధులు తెస్తున్నారని, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), కేంద్ర ఆర్థిక శాఖ నిర్దేశించినదానికంటే జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని విమర్శలు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇంకా అప్పు తెచ్చుకోవడానికి అనుమతి ఇస్తోందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో తమకు మద్దతిస్తే జగన్ కు కావాల్సింది చేయడానికి బీజేపీ ప్రభుత్వం చేయడానికి సిద్ధమేనని గాసిప్ప్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నిక రూపంలో జగన్ ముంగిట బంఫర్ చాన్సు ఉందని చెబుతున్నారు.

రాష్ట్రపతి ఎన్నికలో లోక్ సభ, రాజ్యసభ కు ఎన్నికైన సభ్యులతోపాటు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కూడా ఓటేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్లమెంటులో సభ్యుల పరంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగో పెద్ద పార్టీగా ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ కు లోక్ సభలో 22, రాజ్యసభలో 9 మంది సభ్యులు ఉన్నారు. అలాగే అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో మంచి బేరం (తనపై ఉన్న కేసులు విచారణ ఆలస్యం చేయించుకోవడం, వీలైతే కొట్టేయించుకోవడం) పెట్టుకోవడానికి జగన్ ముందు మంచి చాన్సు ఉందని విశ్లేషకులు ఢంకా బజాయించి చెబుతున్నారు.
Tags:    

Similar News