ఆఖర్లో అదరగొట్టిన ఇమ్రాన్.. అనూహ్యంగా మారిన పాక్ రాజకీయం

Update: 2022-04-03 10:30 GMT
గడిచిన కొద్ది రోజులుగా దాయాది దేశంలో రాజకీయ అస్థిరత చోటు చేసుకోవటం.. సైన్యం బలోపేతం కావటం.. ప్రధాన మంత్రిగా వ్యవహరిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ను పదవీచ్యుతుడ్ని చేయటం కోసం జరుగుతున్న ప్రయత్నాలు అనూహ్య మలుపు తిరిగాయి. ఈ రోజు (ఆదివారం) జాతీయ అసెంబ్లీలో విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం ఎలాంటి మలుపులకు కారణమవుతుందన్న దానికి భిన్నంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి.

విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ కాసిం సురి రిజెక్టు చేయటంతో సీన్ మొత్తం మారిపోయింది. డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతించిన ఇమ్రాన్ ఖాన్.. ప్రభుత్వాన్ని మార్చాలన్న కుట్ర భగ్నమైందన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఆయన అభినందించారు. పాకిస్థాన్ లోకుట్రలు చెల్లవన్న ఇమ్రాన్.. తమ ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ముందస్తు ఎన్నికలు జరగాలంటూ పిలుపు ఇచ్చిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఏం జరుగుతుందనే ఉత్కంఠ నుంచి.. ఇమ్రాన్ కు ఇబ్బంది లేకుండా ఉండేలా జరిగిన పరిణామం ఆయన బలాన్ని మరింత పెంచేలా చేసిందంటున్నారు. నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాలని ఆయన దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వీని ఇమ్రాన్ కోరారు. పాకిస్థాన్ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు ఆ దేశంలో ఏర్పడిన ఏ ప్రజా ప్రభుత్వం కూడా తమ పదవీ కాలమైన ఐదేళ్లు పాలన సాగించలేదు. ఈ సెంటిమెంట్ ను మరోసారి రిపీట్ కానుంది. 2018 ఆగస్టులో దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్ ప్రభుత్వం సైతం మరో ఏడాది కంటే ఎక్కువ గడువు ఉన్నప్పటికి ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన ప్రభుత్వం ముందే రద్దు కానుంది.

ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించట్లేదంటూ తన నిర్ణయాన్ని ప్రకటించిన డిప్యూటీ స్పీకర్.. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు. కుట్ర జరుగుతోందని.. దేశ భద్రతను పరిగణలోకి తీసుకొని తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానం రాజ్యాంగ విరుద్దంగా పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ఇలాంటివేళ.. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. తాను జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని దేశాధ్యక్షుడికి లేఖ రాసినట్లుగా పేర్కొన్నారు. ''ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి. ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రజలను కోరుతున్నాను. స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ప్రతి పాకిస్థానీకు శుభాకాంక్షలు చెబుతున్నా. నాపై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఒక విదేశీ ఎత్తుగడ. పాకిస్థాన్ ను ఎవరు పాలించాలన్నది మీరే నిర్ణయించాలి'' అని ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రకటన చేశారు.
Tags:    

Similar News