ప్రధానితో సెల్ఫీకి వచ్చి పిడిగుద్దు గుద్దాడే

Update: 2015-12-17 06:09 GMT
ఊహించని పరాభవానికి గురయ్యారు స్పెయిన్ ప్రధాని మరియానో రాజోయ్. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్సెయిన్ ప్రధానికి ఊహించని షాక్ తగిలింది. పెంటేవేద్రా అనే పట్టణంలో ప్రచారం చేయటానికి వెళ్లిన ఆయన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీలో ఆండ్రీస్ అనే యువకుడు పాల్గొన్నాడు. సెల్ఫీ తీసుకోవటానికి అన్నట్లు దగ్గరకు వచ్చాడు.

అసలే ఎన్నికల వేళ కావటంతో.. కాస్తంత లైట్ తీసుకున్న ప్రధాని.. సెల్ఫీకి తగ్గట్లు రెఢీ అయ్యాడు. సదరు కుర్రాడు ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ప్రధాని దగ్గరకు వచ్చి.. మెరుపు వేగంతో ముఖం మీద పిడిగుడ్దు గుద్దాడు. అంతటితో ఆగకుండా ప్రధాని కళ్లజోడును విరగొట్టాడు. ఇలాంటివేమీ అస్సలు ఊహించని ప్రధాని షాక్ తింటే.. ఆయన చుట్టూ ఉన్న వారిది అదే పరిస్థితి.

క్షణాల్లో స్పందించిన భద్రతా సిబ్బంది..  ప్రధానిని ఒక వాహనంలో పంపేసి.. యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన అనంతరం యువకుడ్ని విచారించిన పోలీసులకు సైతం ఆ కుర్రాడు షాకిచ్చాడంట. ప్రధానిని పిడిగుద్దు కొట్టటం చాలా ఆనందంగా ఉందంటూ సంతోషంగా ఉండటం వారిని విస్మయానికి గురి చేస్తుందట.
Tags:    

Similar News