టీవీల్లో అద‌ర‌గొట్టారు.. ఫ‌స్ట్ పేజీలో క‌నిపించ‌లేదు

Update: 2018-03-23 05:21 GMT
నిన్న మ‌ధ్యాహ్నం నుంచి తెలుగు న్యూస్ ఛాన‌ల్స్ ఒక విష‌యం మీద విప‌రీత‌మైన ఫోక‌స్ ప్ర‌ద‌ర్శించాయి. గంట‌ల కొద్దీ ఆ కార్య‌క్ర‌మానికి ప్రాధాన్య‌త ఇచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవ‌రు క‌లిసినా దాని గురించి మాట్లాడుకోకుండా ఉండ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. న‌టుడు శివాజీ వెల్ల‌డించిన ఆప‌రేష‌న్ ద్ర‌విడ‌.. తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఆప‌రేష‌న్ ద్ర‌విడ పేరుతో ఒక జాతీయ పార్టీ చేస్తున్న ఆప‌రేష‌న్ లో.. గ‌రుడ‌.. కుమార‌.. రావ‌ణ‌.. ఉప భాగాల‌ని సినిమా క‌థ మాదిరి చెప్పారు.

శివాజీ నోట మాట‌లు విన్న‌ప్పుడు.. బోర్డు మీద ఆయ‌న ప్లాన్ ను వివ‌రించిన‌ప్పుడు కాసేపు అంతా క‌ళ్లు అప్ప‌గించి చూస్తుండిపోయే ప‌రిస్థితి. అత‌గాడు చెప్పి వివ‌రాల‌న్నీ లాజిక్ గా చూసిన‌ప్పుడు నిజ‌మ‌నిపించేలా ఉండ‌టం విశేషంగా చెప్పాలి. ఛాన‌ల్స్ లో అంత ప్ర‌యారిటీ ఇచ్చిన అంశం.. ఈ రోజు పొద్దున్నే పేప‌ర్లు చూస్తే.. ప్ర‌ధాన ప‌త్రిక ఏదీ కూడా మొద‌టి పేజీలో ఈ వార్త‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

ఇక‌.. ఇంగ్లిషు దిన‌ప‌త్రిక‌లు సైతం దీనికి పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదు. టీవీల్లో సంచ‌ల‌నంగా మారి..బ్రేకింగ్ ల మీద బ్రేకింగ్ లు వేసిన ఒక అంశానికి పేప‌ర్ల‌లో ప్రాధాన్య‌త చాలా త‌క్కువ‌గా ఉంది. ప్ర‌ధాన ప‌త్రిక‌ల్లో ఒక దాన్లో అయితే.. శివాజీ చెప్పిన సినిమా క‌థ అని పేర్కొంటే.. మ‌రో రెండు ప్ర‌ధాన పత్రిక‌ల్లో ఒక మోస్త‌రుగా ప్రాధాన్య‌త ఇవ్వ‌టం క‌నిపించింది. మొత్తానికి టీవీ ఛాన‌ల్స్ లోనూ.. సోష‌ల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారిన అంశం.. పొద్దున్నే పేప‌ర్లోకి వ‌చ్చేస‌రికి ఎలాంటి ప్రాధాన్య‌త లేక‌పోవ‌టం చూస్తే.. శివాజీ చెప్పిందంతా సినిమాటిక్ గా పేప‌ర్లు తేల్చేశాయా? అన్న భావ‌న రాక మాన‌దు.
Tags:    

Similar News