డుమ్మా కొట్టిన కోమటిరెడ్డిని ఢిల్లీకి రావాలంటూ ప్రియాంక నుంచి పిలుపు

Update: 2022-08-24 07:30 GMT
మునుగోడు ఉప ఎన్నిక పుణ్యమా అని తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఈ ఉప పోరు అధికార టీఆర్ఎస్ తో పాటు విపక్ష కాంగ్రెస్.. బీజేపీలకు ప్రతిష్ఠాత్మకం కావటంతో గెలుపే లక్ష్యంగా పార్టీలు పని చేస్తున్నాయి. ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టుకోవడానికి సిద్ధంగా లేని పరిస్థితి.

అయితే.. మునుగోడు ఎన్నికల ప్రచారానికి సంబంధించి తాను దూరంగా ఉంటానని కాంగ్రెస్ సీనియర్ నేత.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలాన్ని రేపాయి. రెండు రోజుల క్రితం ఢిల్లీలోని సోనియమ్మ నివాసంలో ప్రియాంక ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం జరగటం.. దానికి కోమటిరెడ్డి వెళ్లకపోవటం తెలిసిందే.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తనను బాధకు గురిచేస్తున్నాయని.. తాను మనస్థాపానికి గురయ్యానని.. ఆయన్ను మారిస్తే తప్పించి.. మార్పు రాదన్న వాదనను వినిపిస్తున్న కోమటిరెడ్డి వ్యాఖ్యలతో ఆయన విషయంలో అధినాయకత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి వేళ.. భువనగిరి ఎంపీ వెంకటరెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి కబురు వచ్చింది. ప్రియాంక గాంధీతో భేటీ కోసం ఆయన్ను ఢిల్లీకి పిలుస్తున్నారు.

దీంతో.. కోమటిరెడ్డిని బుజ్జగిస్తారా? సాగనంపుతారా? అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆయన్ను సాగనంపే కార్యక్రమం ఉండదని.. బుజ్జగింపు ఉంటుందని చెబుతున్నారు. వేటు వేయటమే లక్ష్యమైతే ఢిల్లీకి పిలవరని..

నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. అందుకు భిన్నంగా ఢిల్లీకి పిలవటం.. అది కూడా ప్రియాంకతో భేటీ కోసం కావడం చూస్తే.. కచ్ఛితంగా ఆయన్ను బుజ్జగించే పనిలో భాగంగానే ఆయన్ను పిలుస్తున్నట్లు గా చెబుతున్నారు. మరి.. కోమటిరెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News