సౌత్ మీద క‌న్నేసిన గాంధీ ఫ్యామిలీ

Update: 2017-08-07 06:07 GMT
కాలం క‌లిసి వ‌చ్చే వేళ‌.. దేనిని ప‌ట్టించుకోకుండా.. అంతా త‌మ గొప్ప‌త‌న‌మే అని ఫీల‌య్యే వారు కొంత‌మంది క‌నిపిస్తారు. మ‌రికొంద‌రు దీనికి భిన్నం.. టైం దివ్యంగా న‌డుస్తున్న‌ప్పుడు మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తూ.. న‌మ్మ‌కాల‌కు పెద్ద‌పీట వేస్తూ ఆచితూచి అడుగులు వేస్తుంటారు. మొద‌టి ప‌ద్ధ‌తిలో న‌డిచేందుకు రెఢీ అవుతోంది కాంగ్రెస్ అధినేత్రి.

నాన్ స్టాప్ గా ప‌దేళ్లు ప‌వ‌ర్ లో ఉన్న వేళ‌.. త‌మ‌కు తిరుగులేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం.. ఏడాపెడా నిర్ణ‌యాలు తీసుకోవ‌టం తెలిసిందే. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌గిలిన షాక్ తో కాంగ్రెస్ కు దిమ్మ తిరిగిపోయే షాక్ త‌గిలింది. ఆ త‌ర్వాత నుంచి మోడీ మాస్ట‌ర్ మైండ్ తో సోనియ‌మ్మ‌కు వ‌రుస‌గా సినిమాల మీద సినిమాలు క‌నిపిస్తోన్న ప‌రిస్థితి. మూడున్న‌రేళ్ల వ్య‌వ‌ధిలో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి దారుణంగా మార‌ట‌మే కాదు.. కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉనికి నామ‌మాత్రంగా మారిపోయింది.ఒక‌ప్పుడు తిరుగులేని స్థాయి నుంచి ఈ రోజు ఉనికి కోసం పోరాడాల్సిన దుస్థితి.

ఇలాంటి వేళ‌లో.. ఆ పార్టీకి ఒక్క‌సారిగా సెంటిమెంట్లు.. సంప్ర‌దాయాలు గుర్తుకు వ‌స్తున్నాయి. న‌మ్ముకున్న యువ‌రాజు కార‌ణంగా ఎలాంటి ఉప‌యోగం లేద‌ని తేలిపోయిన నేప‌థ్యంలో రాహుల్ స్థానంలో మ‌రెవ‌రినైనా తీసుకురాకుంటే పార్టీ మ‌నుగ‌డ‌కు క‌ష్ట‌మ‌న్న‌ట్లుగా ప‌రిస్థితి మారింది. కాంగ్రెస్‌కు త‌రుపుముక్కగా భావించే ప్రియాంక‌ను రంగంలోకి దించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ.. అమ్మ‌కు.. సోద‌రుడికి సాయంగా నిలిచే ప్రియాంకను 2019 ఎన్నిక‌ల బ‌రిలో దించాల్సిందేన‌న్న వాద‌న కాంగ్రెస్ లో రోజురోజుకి పెరుగుతోంది. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల ప‌ట్ల ఏ మాత్రం ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌ని ప్రియాంక తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల నేప‌థ్యంలో తాను ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేందుకు ఓకే చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడామెను ఎక్క‌డ నుంచి బ‌రిలోకి దింపాల‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.
విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఆమెను సౌత్ నుంచి బ‌రిలోకి దించాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రం ఏమైనా ఉందంటే అది క‌ర్ణాట‌క మాత్ర‌మే. అందుకే.. ఆ రాష్ట్రం నుంచే ప్రియాంక‌ను ఎన్నిక‌ల బ‌రిలో దించాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.  అధికారం చేజారిన‌ప్పుడు.. తిరిగి సొంతం చేసుకోవ‌టానికి త‌మ‌కు సౌత్ సాయంగా నిలుస్తుంద‌న్న సెంటిమెంట్ కాంగ్రెస్‌కు మొద‌ట్నించి ఉన్న‌దే.

మాజీ ప్ర‌ధాని ఇందిర‌మ్మ సైతం రెండోసారి రాజ‌కీయాల్లో రాణించేందుకు క‌ర్ణాట‌క‌ను ఎంచుకున్న విష‌యాన్ని రాజ‌కీయ విశ్లేష‌కులు గుర్తు చేస్తుంటారు. ఇప్పుడు అదే ఆన‌వాయితీని పాటిస్తూ.. ప్రియాంక‌ను క‌ర్ణాట‌క‌లోని ఏదైనా లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దింప‌టం ద్వారా.. మార్పు తీసుకురావొచ్చ‌న్న భావ‌న‌లో కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం ఉంద‌ని చెబుతున్నారు.  మ‌రి.. ప్రియాంక‌ను బ‌రిలో దించ‌టానికి అనువుగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల విష‌యానికి వ‌స్తే.. ఇందిర‌మ్మ పోటీ చేసిన  ఉడిపి - చిక్ మంగుళూరు నుంచి కానీ.. ఒక‌వేళ అది కుద‌ర‌నిప‌క్షంలో మైసూర్ నుంచి కానీ పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. మ‌రోవైపు మోడీ.. అమిత్ షా ద్వ‌యం క‌న్ను కూడా సౌత్ మీద ప‌డ‌టం తెలిసిందే. పీఎంవో ఆఫీసును బెంగ‌ళూరులో ఏర్పాటు చేయాల‌ని మోడీ భావిస్తుంటే.. సొంతింటిని క‌ర్ణాట‌క‌లో ఏర్పాటు చేసుకోవాల‌ని అమిత్ షా భావిస్తున్నారు. మొత్తానికి.. దేశానికి కీల‌క‌మైన నేత‌ల చూపంతా సౌత్ మీద ఫోక‌స్ కావ‌టం విశేషంగా చెప్పాలి.
Tags:    

Similar News