త్వరలో ఏపీ రానున్న ప్రియాంకా వాధ్రా

Update: 2019-02-09 17:05 GMT
ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా వాధ్రా ఈ నెలలో ఆంధ్రప్రదేశ్ రానున్నారు. ఈ మేరకు ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ రఘువీరా రెడ్డి వెల్లడించారు. ఏపీ ప్రత్యేక హోదా భరోసా యాత్రలో భాగంగా ఆమె ఫిబ్రవరి మూడో వారంలో ఏపీకి వస్తారని.. యాత్రలో పాల్గొంటారని రఘువీరా తెలిపారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా హాజరవుతున్నారని చెప్పారు.
   
లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను.. ఈ నెలాఖరులోగా ఖరారు చేస్తామని... అభ్యర్థులతో పాటు మేనిఫెస్టోను కూడా తయారు చేస్తామని తెలిపారు. నిరుద్యోగం - రాఫెల్ కుంభకోణం - పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల తమ ప్రచార అస్త్రాలని రఘువీరా పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఏపీకి తీరని అన్యాయం చేశారని - నల్ల జెండాలతో ఆయన పర్యటనకు నిరసన తెలియజేస్తామని స్పష్టం చేశారు. తమ పార్టీ నాయకుల్ని తీసుకునేవన్నీ బ్రోకర్ పార్టీలేనని.. అవన్నీ తమకు శత్రవులేనని రఘువీరా విమర్శించారు.
   
కాగా ఈ యాత్ర ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా ప్రియాంకను రప్పించేందు కోసమే ఆలస్యం చేశారని తెలుస్తోంది. అయితే, ఇప్పటికే టీడీపీ ధర్మపోరాట దీక్షలు చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ భరోసా యాత్ర మొదలుపెడుతోంది. ఇలా ఎవరికి వారు పోరాడడమే తప్ప కలిసికట్టుగా సాగడం లేదన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
   
ఇదంతా ఎలా ఉన్నా ప్రియాంకను రాష్ట్రానికి తెస్తే పార్టీకి ఊపు వస్తుందని ఇక్కడి నాయకులు భావిస్తున్నారు. ఎప్పటినుంచో ఆమెపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించడానికి ఆమె చరిష్మా ఉపయోగపడుతుందన్న ఆశతో ఉంది. మరి ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారన్నది చూడాలి.

Tags:    

Similar News